కాంగ్రెస్‌కు షాకిచ్చిన సర్వే...బిజెపిలో చేరడమే కాదు వారినీ చేర్పిస్తానంటూ సంచలన ప్రకటన

By Arun Kumar PFirst Published Nov 20, 2020, 9:10 PM IST
Highlights

హైదరాబాద్ కు చెందిన కీలక నాయకులు, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ కు చెందిన కీలక నాయకులు, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు. నిబంధనలను అనుసరించి అతి త్వరలో బిజెపి పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు సర్వే వెల్లడించారు. కేవలం తాను బిజెపిలో చేరడమే కాదు చాలా మందిని ఆ పార్టీలో చేర్చి మరింత బలోపేతానికి కృషిచేస్తానని స్పష్టం చేశారు. 

మాజీ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు. మహేంద్రహిల్స్‌లోని సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ లు బిజెపిలో చేరాలని కోరారు. అయితే ఇప్పటికే కాంగ్రెసు పార్టీ తీరు పట్ల చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న సర్వే కూడా బిజెపిలో చేరడానికి వెంటనే ఓకే చెప్పారు. 

ఇక గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నేతలకు చేర్చుకుని బిజెపిని మరింత బలోపేతం చేయడానికి అధిష్టానం రంగంలోకి దిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యూహరచనకు, దాని అమలుకు బిజెపి అధిష్టానం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆయన అప్పుడే చక్రం తిప్పడం ప్రారంభించారు. 

read more  బీజేపీకి జై.. జీహెచ్ఎంసీ బరి నుంచి తప్పుకున్న జనసేన

మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డిని ఆయన కలిసినట్లు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర రెడ్డిని తమ పార్టీలోకి లాగేందుకు గత కొద్ది రోజులుగా బిజెపి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బిజెపిలో చేరుతానని కొండా విశ్వేశ్వర రెడ్డి హామీ ఇవ్వనట్లు తెలుస్తోంది. 

 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దుబ్బాక జోష్ తో హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ స్థితిలో బిజెపి నేతలు పలువురు నేతలను కలిసే అవకాశం ఉంది. మరో కాంగ్రెసు నాయకుడిని కూడా బిజెపి నేతలు కలిసే అవకాశం ఉంది. ఓ టీఆర్ఎస్ నేతతోనూ బిజెపి నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో బండి సంజయ్ ప్రకటనతో తలెత్తిన విభేదాలను పరిష్కరించడంలో భూపేంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ జనసేనను జిహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పించడానికి ఆయన చొరవ ప్రదర్శించినట్లు చెబుతున్నారు. 

click me!