మహాకూటమి: ఆ స్థానాలే మిత్రులకివ్వాలని కాంగ్రెస్ ప్లాన్

By narsimha lodeFirst Published Sep 14, 2018, 5:30 PM IST
Highlights

తెలంగాణలో త్వరలో జరిగే  ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది.


హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరిగే  ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది నేతలు  శుక్రవారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. 

తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు ఇతర పార్టీలతో  కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయానికి వచ్చింది.ఈ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

తెలంగాణలో  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో రాహుల్ చర్చించారు. కొందరు నేతలతో రాహుల్ గాంధీ ముఖాముఖి సమావేశమయ్యారు. మరోవైపు ఈ ఎన్నికల వ్యూహంపై  పార్టీ నేతలతో చర్చించారు. 

తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందనే ధీమాను  రాహుల్ గాంధీ ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే విపక్షాలు కూటమిగా ఏర్పాటు చేసి పోటీ చేసే విషయమై రాహుల్ వద్ద పార్టీ నేతలు ప్రస్తావించారు. పొత్తుల పట్ల ఆయన సానుకూలంగానే స్పందించారు.

అయితే కాంగ్రెస్ పార్టీకి  బలమున్న స్థానాల్లో మిత్రపక్షాలకు కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  రాహుల్ గాంధీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలను విపక్షాలకు కేటాయించాలని రాహుల్ సూచించారు.

సీనియర్లకు సముచిత స్థానం ఇచ్చే విషయమై కూడ పార్టీలో చర్చ జరిగింది. ఈ విషయమై  పార్టీ చీఫ్ రాహుల్ కూడ హమీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అదే విధంగా యువతకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో కూడ పెద్దపీట వేయాలనే చర్చ కూడ వచ్చినట్టు సమాచారం.

పార్టీలో ఎంత పెద్ద నేతలైనా సరే బహిరంగంగా విమర్శలు చేయకూడదని రాహూల్ సూచించారు. పార్టీ వేదికలపైనే  తమ అభిప్రాయాలను పంచుకోవాలని రాహుల్ సూచించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తే చర్యలు తీసుకొంటామని రాహుల్ హెచ్చరించినట్టు సమాచారం.

 మరోవైపు ఎవరికి ఏ రకమైన పదవులు కావాలనే విషయమై కూడ తమ కోరికల చిట్టాను కూడ  విన్పించేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంచార్జీ కుంతియాతో పాటు తాను కూడ అందుబాటులో ఉంటానని రాహుల్ చెప్పారు. 

తెలంగాణలోని పది జిల్లాల్లో జిల్లాకో సభలో రాహుల్ గాంధీ పాల్గొంటానని హమీ ఇచ్చారు. మరోవైపు  సోనియా గాంధీ కూడ ఈ సభల్లో పాల్గొనేలా చూడాలని కొందరు నేతలు కోరారు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.  తెలంగాణలో పార్టీకి నష్టం వాటిల్లకుండా మిత్రపక్షాలను కలుపుకొని సీట్ల సర్ధుబాటు చేసుకోవాలని రాహుల్ సూచించారు.


 

click me!