టీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్: హస్తానికి కలిసొచ్చేనా?

By narsimha lodeFirst Published Aug 18, 2020, 4:22 PM IST
Highlights

ఉప ఎన్నికల్లో గతంలో టీఆర్ఎస్ అనుసరించిన ఫార్మూలానే కాంగ్రెస్ పార్టీ అవలంభించనుంది. అయితే ఈ ఫార్మూలా టీఆర్ఎస్ కు లాభించింది. కానీ, కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఫలిస్తోందోననే చర్చ కూడ లేకపోలేదు.


హైదరాబాద్: ఉప ఎన్నికల్లో గతంలో టీఆర్ఎస్ అనుసరించిన ఫార్మూలానే కాంగ్రెస్ పార్టీ అవలంభించనుంది. అయితే ఈ ఫార్మూలా టీఆర్ఎస్ కు లాభించింది. కానీ, కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఫలిస్తోందోననే చర్చ కూడ లేకపోలేదు.

అనారోగ్యంతో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇటీవల మరణించారు. రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ స్థానం ఖాళీ అయిందని తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియట్ ఎన్నికల కమిషన్ కు సమాచారం పంపింది. 

అయితే ఈ స్థానం నుండి రామలింగారెడ్డి సతీమణికి టిక్కెట్టు ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్ధిని బరిలోకి దింపకుండా చర్యలు తీసుకొంటానని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే  ప్రకటించారు. అయితే జగ్గారెడ్డి ప్రకటనకు భిన్నంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరణించిన సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్ధి మరణిస్తే ఆ కుటుంబసభ్యులు పోటీ  చేస్తే ప్రత్యర్ధి పార్టీలు కూడ తమ అభ్యర్ధులను బరిలో దింపకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేలా సహకరించేవారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించిన సమయంలో టీఆర్ఎస్ పోటీకి పెట్టిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి 2014 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన కిష్టారెడ్డి విజయం సాధించారు.  అనారోగ్య కారణాలతో కిష్టారెడ్డి 2015 ఆగష్టు 25వ తేదీన మరణించారు. మరణించే సమయానికి కిష్టారెడ్డి పీఏసీ ఛైర్మెన్ గా ఉన్నారు. ఈ సమయంలో నారాయణఖేడ్ ఉప ఎన్నికలు జరిగాయి.

ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిపై టీఆర్ఎస్ అభ్యర్ధిని బరిలోకి దింపింది. కిష్టారెడ్డి తనయుడు సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. టీఆర్ఎస్ భూపాల్ రెడ్డిని బరిలోకి దించింది. ఈ స్థానానికి 2016 ఫిబ్రవరి 16వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి భూపాల్ రెడ్డి 53,625 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి విజయపాల్ రెడ్డికి  14,737 ఓట్లు వచ్చాయి.

2016 మార్చి 4వ తేదీన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించారు. రాంరెడ్డి వెంకట్ రెడ్డి వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున సుజాతనగర్, పాలేరు నుండి ఆయన ఐదు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2016 మే 19వ తేదీన పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా రాంరెడ్డి వెంకట్ రెడ్డి భార్య సుచరిత పోటీ చేసింది. అయినా కూడ తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఈ రెండు ఉప ఎన్నికల స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను నిలిపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొంది.

అయితే దుబ్బాకలో పోటీకి సిద్దమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ స్థానంలో పోటీ చేయడానికి బీజేపీ కూడ సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ స్థానం నుండి రెండు దఫాలు పోటీ చేసిన రఘునందరావు పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. పోటీ విషయమై బీజేపీ నాయకత్వం నుండి స్పష్టత రాలేదు.

దుబ్బాకలో దివంగత నేత రామలింగారెడ్డి కుటుంబం నుండి ఒకరిని టీఆర్ఎస్ బరిలోకి దింపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడ అభ్యర్ధి కోసం ప్రయత్నాలు చేస్తోంది.

click me!