ఢిల్లీలో మోడీ ఏం చూపించారో.. చలి జ్వరంతో ఫాంహౌస్‌లో కేసీఆర్: రేవంత్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 13, 2021, 5:47 PM IST
Highlights

దళితులు, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతికేందుకు కాంగ్రెస్ పార్టీ అసైన్‌మెంట్ పట్టాలను ఇచ్చిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి

దళితులు, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతికేందుకు కాంగ్రెస్ పార్టీ అసైన్‌మెంట్ పట్టాలను ఇచ్చిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. పాదయాత్రలో భాగంగా శనివారం అమన్‌గళ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూస్వాముల దగ్గర వేల ఎకరాల భూములంటే సీలింగ్ చట్టం తీసుకొచ్చి వారి భూములను కాంగ్రెస్ పార్టీ పేదలకు పంచిపెట్టిందని రేవంత్ గుర్తుచేశారు.

పండించిన పంటను దళారులు కనీస మద్ధతు ధర కంటే తక్కువకే కొనుగోలు చేస్తే వారిపై పీడీ యాక్ట్ పెట్టి కఠిన శిక్ష విధించేలా కాంగ్రెస్ చర్యలు తీసుకుందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఎరువులు, విత్తనాలు, స్ప్రింకర్లు, ట్రాక్టర్లను సబ్సిడీకి ఇచ్చిందని రేవంత్ తెలిపారు.

పేదలకు పని కల్పించేందుకు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే గుజరాత్ నుంచి వచ్చిన అమిత్ షా, నరేంద్రమోడీ అనే ఇద్దరు బేరగాళ్లు.. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఇద్దరు దళార్లకు దేశాన్ని అప్పగించారని రేవంత్ ఎద్దేవా చేశారు.

అంబానీ, అదానీలను పెంచడానికి పేదలను కొల్లగొట్టడానికి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు వ్యాపారం ముసుగులో భారతదేశ గడ్డ మీదకు అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ.. మన రాజులను మచ్చిక చేసుకుని దేశాన్ని అక్రమించారని రేవంత్ గుర్తుచేశారు.

ఈరోజు కూడా కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల భవిష్యత్‌లో వందల సంవత్సరాలు ఈ దేశంలో పుట్టబోయే పౌరులు బహుళజాతి కంపెనీల చేతుల్లో బానిసలుగా మారడానికి అవసరమైన పునాదులను అమిత్ షా, నరేంద్రమోడీలు వేశారని ఆయన ఆరోపించారు.

ఈ చట్టాల వల్ల కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, ఎఫ్‌సీఐ గోడౌన్లు, సీసీఐ గోడౌన్లు, కనీస మద్ధతు ధర, చౌక ధరల దుకాణాలు వుండవన్నారు. కార్పోరేట్ కంపెనీల చేతుల్లో రైతు నష్టపోతే కోర్టుకెళ్లే అవకాశం కూడా లేకుండా ఈ చట్టాల ద్వారా కల్పించారని రేవంత్ చెప్పారు.

ఈ ప్రమాదం గమనించిన లక్షలాది మంది రైతులు ఢిల్లీని ముట్టడించారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై కేసీఆర్ ఆయన మంత్రివర్గం డిసెంబర్ 8న భారత్ బంద్‌లో పాల్గొన్నారని.. కానీ ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత చలి జ్వరంతో ఫాం హౌస్‌లో పడుకున్నారంటూ రేవంత్ సెటైర్లు వేశారు

click me!