ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న రేవంత్.. అలా అనుకుండా వుండాల్సింది : కోమటిరెడ్డి స్పందన ఇదే

By Siva KodatiFirst Published Feb 9, 2023, 6:01 PM IST
Highlights

ప్రగతి భవన్‌ను పేల్చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రగతి భవన్‌ను ప్రజాదర్భార్ కోసం వినియోగించుకోవాలనో, ఆసుపత్రిగా వాడుకోవాలనో రేవంత్ అంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ప్రగతి భవన్‌ను పేల్చేవేయాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయకుండా వుండాల్సిందన్నారు. ప్రగతి భవన్ కేసీఆర్ సొత్తు కాదని, అది ప్రజల ఆస్తి అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అలా కాకుండా ప్రగతి భవన్‌ను ప్రజాదర్భార్ కోసం వినియోగించుకోవాలనో, ఆసుపత్రిగా వాడుకోవాలనో రేవంత్ అంటే బాగుండేదని వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే.. ఈ నెల  13వ తేదీ నుండి  తాను యాత్ర నిర్వహించనున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి,నల్గొండ,మహబూబ్ నగర్,ఖమ్మం జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. సమయం తక్కువగా  ఉన్నందున బస్సు లేదా బైక్ యాత్ర  చేయాలా అనే విషయమై  ఆలోచిస్తున్నట్టుగా  కోమటిరెడ్డి తెలిపారు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  తాము ఏం చేస్తామో  చెబుతామని వెంకట్ రెడ్డి  చెప్పారు. 

Also REad: భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ: కేటీఆర్ కు రేవంత్ కౌంటర్, ప్రగతి భవన్ పై ఇలా...

కాగా.. హత్ సే హత్ జోడో  అభియాన్  కార్యక్రమంలో భాగంగా  కాంగ్రెస్ నేతలు  యాత్రలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో  భాగంగానే  కాంగ్రెస్ నేతలు  యాత్రలకు శ్రీకారం చుట్టారు.  ఈ  నెల  6వ తేదీన మేడారం నుండి  రేవంత్ రెడ్డి  పాదయాత్రను ప్రారంభించారు. ఇతర నేతలు  కూడా  పాదయాత్రలకు సంబంధించి షెడ్యూల్ ఇవ్వాలని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే  కోరారు. ఇళ్లు, పార్టీ కార్యాలయాలను వదిలి ప్రజల్లోనే ఉండాలని కాంగ్రెస్ నేతలకు  సూచించారు ఠాక్రే. ఈ ఏడాది చివర్లో  తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు  నేతలంతా  కలిసికట్టుగా  పనిచేయాలని  పార్టీ నాయకత్వం కోరింది. 

అంతకుముందు కేటీఆర్ సైతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా  ఉన్న  రేవంత్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు  చేయవచ్చా అని  ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ విధానం ఇదేనా అని  ఆయన నిలదీశారు. రాష్ట్రానికి  సీఎంగా బాధ్యతలు నిర్వహించేవాళ్లు  ప్రగతి భవన్ లో  ఉంటారని కేటీఆర్  చెప్పారు. ఇది తీసేయాలి, అది  రద్దు చేయాలని  అనడం తప్పా   రేవంత్ రెడ్డికి  మంచి మాటలు రావా  అని కేటీఆర్  అడిగారు. ధరణిని  రద్దు  చేస్తామని  రేవంత్ రెడ్డి  చెబుతున్నాడని.. కానీ  ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ధరణికి అనుకూలంగా మాట్లాడుతున్నారని  కేటీఆర్ చురకలంటించారు. 
 

click me!