తాను భూముల కబ్జాకు పాల్పడితే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.
హైదరాబాద్: తాను భూములు కబ్జా చేస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.గురువారం నాడు మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవాళ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నిషేధిత జాబితా లో చేర్చిన భూములను కేసీఆర్ సర్కార్ తొలగించిందన్నారు. 2014 నుండి ఈ భూములు ఎవరెవరి పేరుపై బదిలీ జరిగాయో బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కేటీఆర్ బృందం కొల్లగొట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు... రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ భూములను కొల్లగొట్టారని కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.మియాపూర్ లో కవితకు రూ. 500 కోట్ల విలువైన భూమి ఎక్కడి నుండి వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై కవిత చర్చకు సిద్దమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు
బీఆర్ఎస్ సర్కార్ రూ. 5 వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు 50 ఎకరాల భూమిని కూడా కట్టబెట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు.
also read:పేల్చడం, తీసేయడమే తెలుసు: రేవంత్ ప్రగతి భవన్ పేల్చివేత వ్యాఖ్యలపై కేటీఆర్
ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేవారు. ప్రగతి భవన్ ను పేలుస్తామని అనడం సరైంది కాదన్నారు. ఆర్టీఐని అడ్డుపెట్టుకొని దందాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. రిటైర్డ్ అధికారులను ఆసరా చేసుకొని దందాలు సాగిస్తున్నారని కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ విమర్శలపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తాం
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. గడీల విధానానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉండి ఉపయోగం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ములుగు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఉపయోగం లేని ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చినా నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి సమర్ధించుకున్నారు.