
కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఈ నిర్ణయం జరిగిందని తెలిపింది. ఇక, రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించిన తర్వాత.. కోమటిరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డిపై డైరెక్ట్ గానే విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో తన ఇంటికి ఎవరూ రావొద్దంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తర్వాత కొందరు సీనియర్ నేతలు చర్చలు జరపడంతో సీన్ మారింది. రైతుల సమస్యలపై ఇందిరాపార్క్‌లో జరిగిన రెండ్రోజుల దీక్షలో రేవంత్.. కోమటిరెడ్డికి తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకే వేదికపై కనిపించారు. ఇక, రెండు నెలల క్రితం స్వయంగా రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఇక, ఇటీవల పార్లమెంట్ ఆవరణలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాహుల్ గాంధీతో కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణ విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో పార్టీ పరిస్థితులపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దీంతో ఆయన దూకుడుగా పనిచేస్తారని టీ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఫోకస్ చేసిన అధిష్టానం.. ఇప్పటికే ఆయా రాష్ట్రాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలతో కూడా రాహుల్ సమావేశం అయ్యారు. దాదాపు మూడు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వరి సేకరణ అంశాన్ని.. రాహుల్ గాంధీకి వివరించారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై రాహుల్ గాంధీ వారికి దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ విధానాలపైన పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో, ఆ పార్టీ విషయంలో మెతక వైఖరి అవలంభించడం తగదని అన్నారు. పార్టీ నేతల మధ్య ఐక్యత ముఖ్యమని.. అంతా కలిసి పనిచేయాలని సూచించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు.
పార్టీ అంతర్గత విభేదాలపై మీడియా ముందు మాట్లావద్దని, ఏ సమస్య ఉన్నా తనకు లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చెప్పుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి తమ సమస్యలను వివరించారు. ఇక, ఈ నెల చివరి వారంలో రాహుల్ గాందీ తెలంగాణలో పర్యటించనున్నారు.