వారం రోజులు ఉపవాసం... ఎనిమిదోరోజు ప్రసాదం పెట్టినట్లుంది దళిత బంధు: జీవన్ రెడ్డి సెటైర్లు

By Arun Kumar PFirst Published Aug 17, 2021, 4:23 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించిన దళిత బంధు పథకంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు విసిరారు.  వారం రోజుల ఉపవాసం ఉంచి ఎనిమిదో రోజు ప్రసాదం పెట్టినట్లు దళిత బంధు వుందన్నారు.  

కరీంనగర్: దళిత బంధు పథకం ఎలా ఉందంటే వారం రోజుల ఉపవాసం ఉంచి ఎనిమిదో రోజు ప్రసాదం పెట్టినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దళితుల మనోభావాలు దెబ్బ తీసేందుకే ఈ పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. దళిత బిడ్డలకు బంగారు తెలంగాణ వద్దు... వారికి అన్నిట్లోనూ సమానంగా అవకాశం ఇస్తే చాలని జీవన్ రెడ్డి అన్నారు.

''తెలంగాణ వచ్చాక దళితున్ని సిఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాటను నెరవేర్చకుండా ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇది చాలదన్నట్లు దళిత ఎమ్మెల్యే రాజయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి అవినీతి ఆరోపణలు అంటగట్టి భర్తరప్ చేశాడు. అంతేకాదు ఆ స్థానంలో కడియం శ్రీహరికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఈసారి తనను కూడా తప్పించాడు'' అని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. 

''దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వవలసి వస్తుంది కాబట్టే రూ.10 లక్షల బంధు పెట్టాడు. కానీ ఈ పథకం అందరివరకు వచ్చేసరికి కేసీఆర్ కు సీఎం పదవి ఉండదు. గత ఏడు సంవత్సరాల నుండి ఎస్సీ నిధుల నుండి సంవత్సరానికి ఐదు వేల కోట్లు ఖర్చు చేయకుండా బడ్జెట్ ను దారి మళ్లించారు'' అని ఆరోపించారు. 

''దళిత బంధు కుట్రపూరితమైన స్కీంలా ఉంది. దళితులకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 3 ఎకరాల భూమి ఇస్తే ఆ కుటుంబాలు స్థిరపడేవి. టీఆరెస్ ఎన్నికల ఎజెండా ప్రకారం దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి కానీ10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు సీఎం కేసీఆర్'' అని అన్నారు. 

read more  సీఎంఓలోకి రాహుల్‌ బొజ్జా: హుజూరాబాద్‌లో కేసీఆర్

''బిశ్వా కమిటీ లెక్కల ప్రకారం రాష్టంలో లక్షా 90 వేళ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఖాళీగా వున్న దాదాపు 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే దళితులకు 30వేళ ఉద్యోగాలు వస్తాయి. దళిత బిడ్డలు ఉద్యోగాలు ఇవ్వమన్నారు కానీ రూ.10 లక్షలు ఇవ్వమనలేదు. ఇదే బిశ్వా కమిటీ ప్రకారం ప్రతి సంవత్సరం10 వేల ఉద్యోగాలు దళితులకు ఇవ్వవచ్చు'' అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 

''చింతమడక, ఎర్రవెలిలో ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయా.? అదే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. అక్కడ చూసుకో కేసీఆర్. నిరుపేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తా అన్నావ్. ఎక్కడైనా ఇచ్చిన దాఖలు ఉంటే చూపించు...నా పదవికి రాజీనామా చేస్తా'' అని కేసీఆర్ కు సవాల్ విసిరారు.

''రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం అంటూ లేదు. దళితుల ఆత్మగౌరవం అని మాటలు మాట్లాడం కాదు... ఇండ్లు నిర్మించి చూపించు కేసీఆర్. ఏడేళ్లలో దళితులకు ఎన్ని ఇండ్లు నిర్మించిఇచ్చావో చెప్పు. రానున్న రెండేళ్లలో 5వేల ఇండ్లు నిర్మించి వచ్చే ఎన్నికలలో పోటీకి రావాలి'' అని సూచించారు.

''గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అంటే రాజశేఖర్ రెడ్డి సీఎం అయినవెంటనే దళిత ఐఎఎస్ అధికారికి ముఖ్యమైన రెవెన్యూ కార్యదర్శిగా నియమించారు. కానీ నువ్వు ఏడేళ్లకు ఓ దళితున్ని   కార్యాలయంలో కార్యదర్శి నియమించావు. భవిష్యత్ లో మా ప్రభుత్వం రాగానే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కల్యాణలక్ష్మి బదులుగా పెళ్లి చేసుకున్న వారికి ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తాం'' అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. 

click me!