రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో పొరపాటు చేసిన సీతక్క.. అసలేం జరిగిందంటే..

Published : Jul 18, 2022, 12:45 PM ISTUpdated : Jul 18, 2022, 12:52 PM IST
రాష్ట్రపతి ఎన్నికల్లో  ఓటు వేసే సమయంలో పొరపాటు చేసిన సీతక్క.. అసలేం జరిగిందంటే..

సారాంశం

తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  అయితే ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేశారు.  


తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు 99 మంది సభ్యులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేశారు. బ్యాలెట్ పేపర్ తీసుకున్న సీతక్క.. కాంగ్రెస్ మద్దతు తెలుపుతున్న యశ్వంత్ సిన్హాకు బదులుగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటువేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో బ్యాలెట్ పత్రం ఇవ్వాలని సీతక్క అడిగారు. 

పొరపాటుగా ఓటు పడిందని అధికారులకు చెప్పిన సీతక్క.. బ్యాలెట్ పేపర్‌ను డ్రాప్ బాక్స్‌లో వేయకుండా ఉండిపోయారు. తనకు మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని సీతక్క కోరడంతో.. ఆమె విజ్ఞప్తిని రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పలు తెలుగు న్యూస్ చానల్స్ రిపోర్ట్ చేశాయి. అయితే బయటకొచ్చిన తర్వాత సీతక్క మాత్రం తాను సరిగానే ఓటు వేశానని చెప్పారు. తమ పార్టీ అనుకున్న అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు. బ్యాలెట్ పేపర్‌పై పెన్ మార్క్ పడటంతో.. చెల్లుబాటు అవుతుందో, లేదో అనే అనుమానం ఉందన్నారు. 

Also Read: తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. తొలి ఓటు వేసిన మంత్రి కేటీఆర్..

ఇక, ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది.పార్లమెంట్ హౌస్‌తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలో పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో  ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 21న జరగనుంది. అయితే ఇప్పటివరకు పార్టీల మద్దతు సమీకరణాలను పరిశీలిస్తే.. ద్రౌపది ముర్ముకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక, రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో పార్లమెంటు ఉభయ సభలు, అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు.. అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్‌ పేపర్లను ఈసీ అందుబాటులో ఉంచింది. ఇక, తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ.. 132గా ఉంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓట్ల విలువ 15,708గా ఉంది.

PREV
click me!

Recommended Stories

సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu