
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌తో పాటు, రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ శాసనసభలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో.. మంత్రి కేటీఆర్ తొలి ఓటు వేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్నారు. మరోవైపు బీజేపీకి చెందిన ముగ్గురు శాసన సభ్యులు కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మరోవైపు వరంగల్‌లో ఉన్న సీఎం కేసీఆర్, కొందరు మంత్రులు.. కాసేపట్లో హైదరాబాద్ చేరుకుంటారు. వారు హైదరాబాద్ చేరుకోగానే నేరుగా అసెంబ్లీ చేరుకుని ఓటు వేయనున్నారు.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా యశ్వంత్ సిన్హాకు మద్దతుగా ఓటు వేయనున్నారు. ఇక, బీజేపీ ఎమ్మెల్యేల.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేయనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల ఈ నెల 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఇప్పటివరకు పార్టీల మద్దతు సమీకరణాలను పరిశీలిస్తే.. ద్రౌపది ముర్ముకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక, రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో పార్లమెంటు ఉభయ సభలు, అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు.. అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్ పేపర్లను ఈసీ అందుబాటులో ఉంచింది. ఇక, తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ.. 132గా ఉంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓట్ల విలువ 15,708గా ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధిష్టానం తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్ నిర్వహించింది. మాక్ పోలింగ్‌కు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు.