కరోనాతో మావోయిస్ట్ అగ్రనేత మృతి... భావోద్వేగంతో కన్నీటిపర్యంతమైన సీతక్క

By Arun Kumar PFirst Published Jun 25, 2021, 9:47 AM IST
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగానికి లోనయి కన్నీటి పర్యంతమయ్యారు.

మహబూబాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప హరిభూషణ్‌ (59) కరోనాతో  మృతి చెందినట్లు తెలియడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. హరిభూషణ్ ఈ నెల 21న మృతి చెందినట్లు ప్రకటన వెలువడగానే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెంలోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలోనే వారు సీతక్కను పట్టుకుని బోరున విలపించడంతో భావోద్వేగానికి గురయిన ఆమె కూడా కన్నీరు పెట్టుకున్నారు.  

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... తాను హరిభూషణ్ తో కలిసి ప్రజల హక్కుల కోసం పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం చాలా బాధాకరమని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు ఎమ్మెల్యే సీతక్క. 

హరిభూషణ్‌ బ్రాంకైటిస్‌, ఆస్తమా వ్యాధులతో బాధపడుతూ కరోనా బారిన పడటంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించినట్లు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను ప్రజల మధ్యనే పూర్తి చేసినట్లు... 22న సంస్మరణ సభ కూడా జరిపినట్లు వెల్లడించారు.  హరిభూషణ్‌ చనిపోయినట్లు మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్పీలు కోటిరెడ్డి, సునీల్‌దత్‌ కూడా ప్రకటించారు.  

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, దండకారణ్యం మాడ్ డివిజన్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యులు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క కూడా కరోనాతో మరణించారని మావోయిస్టు పార్టీ తెలిపింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ప్రకటన జారీ అయింది. 

click me!