వారిని పట్టించుకోరా, చెంచాగిరి చేసుకుంటూ బతికేస్తారా: జగ్గారెడ్డి

By Nagaraju penumalaFirst Published Nov 13, 2019, 1:56 PM IST
Highlights

స్వామిగౌడ్ , మమత, రవీందర్, దేవీప్రసాద్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యపై మాట్లాడకుండా ప్రభుత్వానికి చెంచా గిరి చేసుకుంటూ బతుకుతున్నారంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మె బలహీనుడు, బలవంతుడికి మధ్య జరుగుతున్న పోరాటమంటూ అభివర్ణించారు.

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కళ్లున్నా చూడలేని గుడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటూ తిట్టిపోశారు. రాష్ట్రంలో ఉద్యమాలకు విలువ లేకుండా పోయిందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  

దేశ చరిత్రలో 40 రోజులు ఆర్టీసీ సమ్మె జరగడం ఇదే ప్రథమం కావచ్చునని తెలిపారు. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకకపోవడం విచారకరమన్నారు. తక్కువ జీతాలు ఉన్న ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

ఇకపోతే బుధవారం కూడా మరో ఆర్టీసీ కార్మికుడు ఆవుల నరేశ్‌ ఆత్మహత్యకు పాల్పడటం దారుణమని మండిపడ్డారు. ఇంకా ఎన్నిరోజులు సమ్మె కొనసాగుతుందో తెలియడం లేదంటూ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పుకొచ్చారని కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రం రావణకాష్టంగా మారిందన్నారు.  

రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 
 
బంగారు తెలంగాణ కావాల్సిన రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా, గుండెపోటు తెలంగాణగా మారిందని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 

ఆర్టీసీ కార్మికులు నలభై రోజులుగా ఆందోళనలు చేపడుతుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కేవలం సీఎం కేసీఆర్ మాటలను బలపరుస్తున్నారే తప్ప కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

స్వామిగౌడ్ , మమత, రవీందర్, దేవీప్రసాద్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యపై మాట్లాడకుండా ప్రభుత్వానికి చెంచా గిరి చేసుకుంటూ బతుకుతున్నారంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మె బలహీనుడు, బలవంతుడికి మధ్య జరుగుతున్న పోరాటమంటూ అభివర్ణించారు. అయితే భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో చూడాలంటూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

RTC Strike: పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ: హైకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న అశ్వత్థామరెడ్డి

సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తాం: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

click me!