తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన కామారెడ్డి స్థానానికి కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 55 స్థానాలకు, రెండో జాబితాలో 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన 19 స్థానాలకు నవంబర్ 2లోపు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన కామారెడ్డి స్థానానికి కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
గజ్వేల్ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూమకుంట నర్సారెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఇక, కామారెడ్డి విషయానికి వస్తే.. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకట రమణారెడ్డిని ప్రకటించింది. అయితే రెండు జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.
గతకొంతకాలంగా తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్లీర్ అలీ చెబుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ రెండో జాబితాలో ఆయన పేరు ఉంటుందని భావించారు. అయితే సీనియర్ నేత బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పినప్పటికీ.. కామారెడ్డి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ఖరారు చేయకపోవడం వెనక స్ట్రాటజీ ఉన్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కామారెడ్డి నుంచి కేసీఆర్‌కు ధీటైన అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి నుంచి కేసీఆర్‌పై పోటీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలో దింపాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కొండగల్ పోటీ చేయనున్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌ను కామారెడ్డి నుంచి కూడా బరిలో నిలపడం ద్వారా.. కేసీఆర్‌ను బలంగా ఎదుర్కొవచ్చని కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
అయితే కామారెడ్డితో పాటు నిజామాబాద్ అర్బన్ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. కామారెడ్డి నుంచి బరిలో దిగాలని కోరుకున్న షబ్బీర్ అలీని.. నిజామాబాద్ అర్బన్ స్తానం నుంచి బరిలో దింపేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించిన మహేష్ గౌడ్‌తో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే చర్చలు జరిపిందని.. అసంతృప్తి చెందకుండా ఆయనను బజ్జగించిందనే ప్రచారం సాగుతుంది. దీంతో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీని దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.