
కరీంనగర్ : బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింకోట గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగగా వారిని పోలీసులు నిలువరించారు.
కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రసమయి పర్యటించారు. ఇలా కాసింపేట గ్రామానికి వెళ్ళిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. గో బ్యాక్ రసమయి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే కాన్వాయ్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని చిగురుమామిడి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వీడియో
ఇక గతేడాది ఇలాగే రసమయికి ఇదే గన్నేరువరం మండల ప్రజలనుండే నిరసన సెగ తగిలింది.డబుల్ రోడ్డు నిర్మాణం కోసం యువజన సంఘాలు ఎమ్మెల్యే కారు పై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు యువజన సంఘాలపై లాఠీచార్జీకి దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
గన్నేరువరం నుండి గుండ్లపల్లికి డబుల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ యువజన సంఘాలు ఆందోళనలకు దిగాయి. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ నేత కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను యువజనసంఘాలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆయన కారుపై దాడికి యత్నించారు. ఈ దాడిని పోలీసులు అడ్డుకున్నారు. యువజన సంఘాల కార్యకర్తలపై పోలీసులు లాంఠీచార్జ్ చేశారు.ఎమ్మెల్యే కారును అక్కడి నుండి సురక్షితంగా పంపించారు.