
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఈరోజు తెలంగాణ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కలిసి వినతిపత్రం అందజేసింది. సీఎస్ శాంతి కుమారిని కలిసిన బృందంలో పలువురు టీపీసీసీ సీనియర్ నేతలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ డీసీసీ అధ్యక్షులుఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. అలాగే హైదరాబాదులో ఉన్న నిరుపేద కుటుంబాలకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేయాలని కోరింది.
సీఎస్‌ను కలిసిన సందర్భంగా కాంగ్రెస్ బృందం మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ భరోసా కల్పించలేకపోయారని ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లితే ప్రభుత్వం స్పందించదా? అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ ఆ విషయాన్నే మర్చిపోయారని విమర్శించారు.