నాపై కేసు నమోదు అయిన విషయం తెలియదు.. సంక్రాంతి తర్వాత విచారణకు హాజరవుతాను: మల్లు రవి

By Sumanth KanukulaFirst Published Jan 12, 2023, 5:06 PM IST
Highlights

కాంగ్రెస్ ఎన్నికల వార్ రూమ్ కేసులో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. అయితే తాను ఈరోజు విచారణకు హాజరుకాలేనని కూడా పోలీసులకు సమాచారమిచ్చినట్టుగా మల్లు రవి చెప్పారు.

కాంగ్రెస్ ఎన్నికల వార్ రూమ్ కేసులో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. అయితే తాను ఈరోజు విచారణకు హాజరుకాలేనని కూడా పోలీసులకు సమాచారమిచ్చినట్టుగా మల్లు రవి చెప్పారు. టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే‌తో సమావేశం ఉన్నందున విచారణకు హాజరుకాలేనని సమాచారమిచ్చానని తెలిపారు. సంక్రాంతి తర్వాత తేదీని నిర్ణయిస్తే.. తప్పనిసరిగా సైబర్ క్రైమ్ ఆఫీసుకు వచ్చి విచారణకు సహాకరిస్తానని చెప్పారు. తాము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు విమర్శించడానికే తప్ప అవమానించడానికి కాదని అన్నారు. అయితే కాంగ్రెస్ వార్ రూమ్ ఘటనలో తనపై కేసు నమోదు చేసిన సంగతి తెలియదని అన్నారు. 

ఇక, ఈ కేసుకు సంబంధించి ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని సైబర్ క్రైమ్ పోలీసులు మల్లు రవికి  సీఆర్‌పీసీ సెక్షన్ 42 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసుల అందుకున్న తర్వాత సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన  మల్లు రవి.. ఈ నెల 10వ తేదీనే సైబర్ క్రైమ్ పోలీసులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లురవి.. ప్రశ్నించే రోజున తన వెంట ఏ పత్రాలు తీసుకురావాలనేది తెలుసుకునే ఉద్దేశంతో పోలీసులను కలిసినట్టుగా చెప్పారు. ఇందుకు సంబంధించి పోలీసులు తనకు అవసరమైన వివరాలను అందించారని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ప్రముఖుల కించపరిచేలా పోస్టింగ్‌లు చేస్తున్నారనే ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు..  మాదాపూర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వార్‌ రూమ్‌పై దాడులు నిర్వహించారు. ఎన్నికల వ్యుహాకర్త సునీల్‌ కనుగోలుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. పలు నాటకీయ పరిణామాల అనంతరం సునీల్ కనుగోలు ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను ప్రశ్నించిన పోలీసులకు.. మార్ఫింగ్ చేసిన చిత్రాలతో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాతే.. పోలీసులు మల్లు రవిని  ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. మల్లు రవిని విచారించిన అనంతరం మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

ఇక, కాంగ్రెస్ వార్‌ రూమ్ ఘటనకు సంబంధించిన విచారణకు పూర్తిగా సహకరిస్తామని మల్లు రవి గతంలోనే స్పష్టం చేశారు. 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహరచన చేసేందుకు ఏర్పాటు చేసిన వార్ రూమ్‌కు తానే ఇంచార్జ్‌గా ఉన్నానని చెప్పారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాసిన మల్లు రవి.. ‘‘నేను వార్‌రూమ్‌కు పర్యవేక్షకుడిగా ఉన్నాను. అక్కడ చేపట్టే అన్ని రాజకీయ కార్యకలాపాలు నా పర్యవేక్షణలోనే జరుగుతాయి’’ అని పేర్కొన్నారు. 

ఈ విషయం తెలిసినా దర్యాప్తు సంస్థ తన వాంగ్మూలాన్ని తీసుకోలేదని.. కేసుతో సంబంధం లేని వ్యక్తులను పిలుస్తున్నారని మల్లు రవి ఆరోపించారు. అందువల్ల ఈ వ్యవహారానికి సంబంధించి లాజికల్ ముగింపు తీసుకురావడానికి తాను దర్యాప్తులో చేరాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

click me!