Munugode ByPoll 2022 : రేవంత్ రెడ్డికి షాక్... టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు

Siva Kodati |  
Published : Aug 14, 2022, 08:03 PM ISTUpdated : Aug 14, 2022, 10:39 PM IST
Munugode ByPoll 2022 : రేవంత్ రెడ్డికి షాక్... టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు

సారాంశం

మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి పరిస్ధితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నేతల మధ్య సఖ్యత లేకపోగా... తాజాగా మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లో చేరారు.   

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్‌లోకి వలసలు పెరిగాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గులాబీ గూటికి చేరుకున్నారు. జమస్థాన్‌ పల్లి సర్పంచ్‌ పంతంగి స్వామిగౌడ్‌, రావిగూడెం సర్పంచ్ గుర్రం సత్యం, కుంట్లగూడెం సర్పంచ్ వీరాళ్ల పారిజాతం గోపాల్, కృష్ణపురం సర్పంచ్ నందిపాటి రాధా రమేశ్, చూళ్లేడు సర్పంచ్ జనిగెల మహేశ్వరి సైదులు, కల్వలపల్లి సర్పంచ్ బీ జగన్, కృష్ణాపురం ఎంపీటీసీ సైదులు మాజీ స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఆయన వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై పడుతున్న భారంపై చర్చ జరగాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ సమస్యల ప్రతిపాదికన జరగాల్సిన చర్చ కాస్తా.. వ్యక్తిగతమైన విమర్శలు, పరుష పదజాలంపై చర్చ జరుగుతుందన్నారు. దీనివల్ల తెలంగాణ సమాజానికి, మునుగోడు ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, పెరిగిన నిత్యావసర ధరలపై చర్చ జరగాలని అన్నారు.

ALso REad:మునుగోడులో పార్టీ గెలుపు కోసం పనిచేస్తా.. ఆ విషయంలో నో కామెంట్స్: జగ్గారెడ్డి

8 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయాల వల్ల.. పేదలపై పడిన భారం గురించి చర్చ జరగాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై భారం వేసి.. బతకడమే కష్టంగా మార్చిందని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ పాలనలో పేదలు, నిరుద్యోగులు, రైతులు.. చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఓట్లు అడగాలంటే.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పరిష్కరించడానికి వారి ప్రణాళికలను చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గానికి కేంద్రంలోని బీజేపీ రూ. 5 వేల కోట్లు ప్రకటించి.. అక్కడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ పని చేసి బీజేపీ ఓట్లు అడిగితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. 

2014 నుంచి కేసీఆర్ చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, దళితులకు 3 ఎకరాలు... ఏ హామీని కూడా కేసీఆర పూర్తి చేయలేదని విమర్శించారు.  ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.  మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు వివాదాల జోలికి వెళ్లకుండా.. ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు. కమ్యూనిస్టులు, కోదండరాం మద్దతు కోరతామని చెప్పారు. 

ఇకపోతే... గత కొన్నిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతోన్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి బ్రదర్స్ (komatireddy brothers) ఎపిసోడ్‌తో పాటు దాసోజు శ్రవణ్ పార్టీని వీడటం, త్వరలో మునుగోడు ఉపఎన్నిక (munugode bypoll) నేపథ్యంలో కాంగ్రెస్ (congress) అధిష్టానం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్యం ఠాగూర్ ఎల్లుండి హైదరాబాద్‌కు రానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (revanth reddy) వ్యతిరేకంగా కొందరు నేతలు గళం విప్పుతుండటం, త్వరలో చేరికలుంటాయని బీజేపీ నేతలు బహిరంగంగా చెబుతూ వుండటంతో  టీకాంగ్రెస్‌లో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలోనే పరిస్ధితిని చక్కదిద్దేందుకు ఠాగూర్‌ని పంపుతోంది కాంగ్రెస్ హైకమాండ్. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్