తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తన కొడుకు పెళ్లికి ఆహ్వానించారు వైఎస్ షర్మిల. ఇవాాళ ప్రజా భవన్ కు వెళ్లి కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను భట్టికి అందించారు షర్మిల.
హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల కలిసారు. బేగంపేటలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ ప్రజా భవన్ కు చేరుకున్న షర్మిల తన కొడుకు పెళ్లి ఆహ్వాన పత్రికను భట్టికి అందించారు. ఈ నెల (జనవరి) 18న జరిగే నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న జరిగే పెండ్లికి తప్పకుండా రావాలని భట్టిని ఆహ్వానించారు షర్మిల.
ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్కను అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించారు షర్మిల. మీకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం పట్ల తానెంతో సంతోషించానని ఆమె అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కలవడంతో భట్టి విక్రమార్కకు షర్మిల అభినందనలు తెలిపారు.
ఇక ఇప్పటికే తన సొంత సోదరుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేనల్లుడి పెళ్లికి రావాల్సిందిగా షర్మిల ఆహ్వానించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఇటీవలే కలిసిన షర్మిల కొడుకు రాజారెడ్డి, అట్లూరి ప్రియ పెళ్లి పత్రిక అందజేసారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రముఖులను కొడుకు పెళ్లికి ఆహ్వానిస్తున్నారు షర్మిల.
ఈరోజు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నని కలిసి నా కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించడం జరిగింది. pic.twitter.com/X6skhDdKgJ
— YS Sharmila (@realyssharmila)
ఇక ఇటీవల షర్మిల కొడుకు, కోడలిని తీసుకుని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు వెళ్లారు. నివాళి అర్పించి తర్వాత తండ్రి సమాధిపైనే కొడుకు, కాబోయే కోడలితో తొలి ఆహ్వాన పత్రిక పెట్టించారు. ఇలా కాబోయే దంపతులకు తండ్రి ఆశీర్వాదం ఇప్పించి వివాహ పత్రికల పంపిణీ ప్రారంభించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన నాయకులనే కాదు జాతీయ స్థాయి నాయకులను సైతం కొడుకు పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు షర్మిల.