కేసీఆర్ హుజూర్‌నగర్ సభ రద్దు వెనుక కారణం ఇదే: విజయశాంతి

By sivanagaprasad KodatiFirst Published Oct 18, 2019, 7:59 AM IST
Highlights

సీఎం హుజూర్‌నగర్ బహిరంగసభ రద్దవ్వడం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడే కేసీఆర్ పర్యటనను వాయిదా వేసుకున్నారని రాములమ్మ ఆరోపించారు

హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం హుజూర్‌నగర్ వెళ్లాల్సి వుంది. అయితే భారీ వర్షం కారణంగా ఆయన ప్రయాణం చివరి నిమిషంలో రద్దయ్యింది.

అయితే సీఎం పర్యటన రద్దవ్వడం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడే కేసీఆర్ పర్యటనను వాయిదా వేసుకున్నారని రాములమ్మ ఆరోపించారు.

చంద్రశేఖర్ రావుకి నిజంగా హుజూర్‌నగర్ బహిరంగసభలో పాల్గొనాలని ఉంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చునని ఆమె ఎద్దేవా చేశారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తనకు కార్మికుల నుంచి చేదు అనుభవం ఎదురవుతుందేమోనని కేసీఆర్ భయపడి వుంటారని.. అందుకే హెలికాఫ్టర్‌ ద్వారా అక్కడికి వెళ్లాలని ముఖ్యమంత్రి భావించారని రాములమ్మ దుయ్యబట్టారు.

సీఎం ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకోవడం ద్వారా ఉపఎన్నికలో పరోక్షంగా తన ఓటమిని అంగీకరించినట్లయ్యిందని విజయశాంతి వ్యాఖ్యానించారు. గురువారం వర్షం కారణంగా సభా వేదిక చిత్తడిగా మారిపోయింది. దీనికి తోడు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌లో ప్రయాణించేందుకు సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు.

మార్గమధ్యంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో పైలట్ల సూచన మేరకు సీఎం పర్యటనకు అనుమతి రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తారని ఎన్నో ఏర్పాట్లు చేసిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు వర్షంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. 

మరోవైపు ముఖ్యమంత్రి  కేసీఆర్‌పై టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని.. మంత్రులు మాతో టచ్‌లోనే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని అశ్వద్ధామరెడ్డి హెచ్చరించారు.

ఉమ్మడి రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచిన ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా అంటూ ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటోంది కార్మికులు కాదని నాయకులు సమ్మె చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానిస్తున్నారని అశ్వద్దామరెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు పోరాడాడని గుర్తు చేశారు. ఉద్యమ స్ఫూర్తితోనే కొట్లాడుతామని.. తమ హక్కులు సాధించుకుంటామని అశ్వద్ధామరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పునాదులు కదిలితే ఏమైనా జరగొచ్చని కేసీఆర్.. ఎన్టీఆర్ కంటే ఛరిష్మావున్న నేత కాదని అశ్వద్ధామ వ్యాఖ్యానించారు. 

గురువారం నాడు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. తన టెలిఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం అవుతోందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి  సమ్మె చేస్తున్నారు.  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈ  నెల 6వ తేదీలోపుగా విదుల్లో చేరని వారంతా సెల్ప్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. బుధవారం నాడు సుధీర్ఘంగా సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం నాడు కూడ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎష్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేశవరావుతో భేటీ అయ్యారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని కేశవరావు కోరారు. ప్రభుత్వానికి తమకు మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని కేశవరావును ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి   ఈ నెల 14 వ తేదీన  కోరారు. చర్చలకు కేశవరావు కూడ సానుకూలంగా సంకేతాలు పంపారు.

click me!