
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యాయామం చేసివచ్చి ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అతను కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్ కుమారుడు శ్రీధర్ (31). ఇటీవల కాలంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.
ఇలాంటి ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఆదివారం ఖమ్మం నగరం, అల్లిపురంలో గరికపాటి నాగరాజు అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. తాజాగా ఖమ్మంలోనే మరో గుండెపోటు మరణం నమోదవడం భయాందోళనలు కలిగిస్తుంది. సోమవారం ఉదయం జిమ్ కు వెళ్లి వచ్చిన కాసేపటికే శ్రీధర్ ఛాతిలో నొప్పి వస్తుందంటూ ఇంట్లో వారికి తెలిపాడు.
రైల్వే గేట్ పడటంతో ఆగిన గుండె...నొప్పితో విలవిల్లాడి అంబులెన్స్ లోనే పేషెంట్ మృతి (వీడియో)
వెంటనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు శ్రీధర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన శ్రీధర్ ని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. క్షణాల్లో కళ్లముందే మృతి చెందడంతో తీవ్రంగా విలపిస్తున్నారు.
ఆదివారం నాడే వారింట్లో ఓ శుభకార్యం జరిగింది. శ్రీధర్ సోదరుడు కొడుకుకి బాలసార చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా హాజరయ్యారు. రాధా కిషోర్ రేణుక చౌదరికి ముఖ్య అనుచరుడు. కాగా, వరుసగా రెండు రోజులు ఇద్దరు యువకులు, ఖమ్మంలో మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కొడుకు మృతి చెందిన విషయం తెలిసి...రాధా కిషోర్ ను పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తున్నారు.