శంషాబాద్ లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం, కాంగ్రెస్ నేత కుమార్తె మృతి...

By Bukka SumabalaFirst Published Aug 1, 2022, 8:14 AM IST
Highlights

శంషాబాద్ లో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూతురు మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. 

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం.. ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. అకాలమరణాలకు దారి తీస్తున్నాయి. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ పరిధిలోని శాతం రాయి వద్ద ఆదివారం అర్ధరాత్రి  దాటిన  తరువాత  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తుండగా.. ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా… మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను  స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  మృతి చెందిన యువతిని టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఫిరోజ్ఖాన్  కుమార్తె  తానియాగా గుర్తించారు. ఆమె బ్యూటీషియన్ గా పని చేస్తున్నారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ మాదాపూర్ లో కాల్పుల కలకలం, ఒకరి మృతి

ఇదిలా ఉండగా, జూలై 20న ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న డీసీఎం వ్యానును హ్యుందాయ్ వెర్నా కారు వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. కారు బోల్తా పడటంతో అందులోని యువకుడు మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

చనిపోయిన వ్యక్తిని నల్గొండ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపిపి రేగట్టె మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిగా గుర్తించారు. దినేష్ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తమ కొడుకు కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. నల్గొండలోని వీటీ కాలనీలోని స్వగృహానికి ప్రత్యేక అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలించారు. టిఆర్ఎస్ నాయకులు రేగట్టె మల్లికార్జున రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పరామర్శించారు. 

click me!