
హైదరాబాద్:ప్రజా సమస్యలపై దృష్టి మరల్చేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల డ్రామాను మొదలు పెట్టారని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు విషయాన్ని పార్టీ అధిష్టానం నిర్ణిస్తోందని ఆయన చెప్పారు.
బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ రెండో తేదీన ప్రగతి సభను నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ సెప్టెంబర్ రెండో తేదీన ప్రగతి సభ నిర్వహించడం సాధ్యం కాదని నిఘా వర్గాలు నివేదిక ఇచ్చాయని ఆయన చెప్పారు
తెలంగాణలో కేసీఆర్ పాలన పట్ల ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. నిఘా వర్గాల నివేదికలో ఈ మేరకు సర్కార్ పై వ్యతిరేకత ఉన్న విషయాన్ని అర్థం చేసుకొన్న కేసీఆర్ ముందస్తు ఎన్నికల అంశాన్ని తెరమీదికి తెచ్చాడని ఆయన ఆరోపించారు. ఓటరు లిస్ట్ పూర్తి కాకుండానే ముందస్తు ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
కేసీార్ మాయామాటలు వినే రోజులు పోయాయని రేవంత్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ రెండో తేదీన కేసీఆర్ సభ నిర్వహించినా 25 లక్షల మంది రారని రేవంత్ రెడ్డి చెప్పారు.
2018 డిసెంబర్ వరకు కూడా నీళ్లు ఇవ్వలేరని రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్త పాస్ పుస్తకాల పేరుతో రైతుల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత సెప్టెంబర్ 2 సభ వాయిదాను ప్రకటిస్తారన్నారు.
అయితే జనవరి 1వరకు కొత్త ఓటర్ల లిస్ట్ ఇవ్వమని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సంఘానికి లేఖ రాసిందని ఆయన చెప్పారు.ముందస్తు ఎన్నికలు వస్తే బీజేపీతో కలిసి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.