బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కాంగ్రెస్ పథకాలు కాపీ కొట్టారు : కేసీఆర్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు

By Siva Kodati  |  First Published Oct 15, 2023, 9:53 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి . కాంగ్రెస్ మేనిఫోస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని .. త్వరలోనే కాంగ్రెస్ మేనిఫోస్టోను విడుదల చేస్తామని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫోస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని కేసీఆర్ ప్రశ్నించారని.. మరి ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను ఎలా అమలు చేస్తారని పొంగులేటి నిలదీశారు. మీ అక్రమ సంపాదనలో తీసి ఖర్చు పెడతారా అంటూ ఆయన దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో మీ దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని.. త్వరలోనే కాంగ్రెస్ మేనిఫోస్టోను విడుదల చేస్తామని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 

అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి కేసీఆర్ హామీలను ప్రకటించారని ఆరోపించారు. సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చాక కేసీఆర్ కనిపించకుండా పోయారని, చలి జ్వరం వచ్చిందని కేటీఆర్ చెప్పారని రేవంత్ చురకలంటించారు. 

Latest Videos

ALso Read: కేసీఆర్‌కు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది .. మా పథకాలు కాపీ కొట్టి మేనిఫెస్టో , ఇక తప్పుకుంటే బెటర్ : రేవంత్

మా మేనిఫెస్టోతో ఆగం అవుతారని అన్నారని.. మరి ఇప్పుడేం అంటారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాము మహాలక్ష్మీ అంటే కేసీఆర్ సౌభాగ్యలక్ష్మీ అన్నారని.. తాము సిలిండర్ 500 అంటే, కేసీఆర్ 400 అన్నాడని దుయ్యబట్టారు. నిధులు లేవు , నిధులు సరిపోవు అన్న మాట ఉత్తదేనని రేవంత్ వ్యాఖ్యానించారు. సారా వేలం పాటలో పోటీ జరిగినట్లు మమ్మల్ని కాపీ కొట్టాడని.. సోనియా గాంధీ ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలవుతాయని కేసీఆరే నిరూపించారని ఆయన చురకలంటించారు. 

కేసీఆర్ స్వయంప్రకాశి కాదు.. పరాన్నజీవి అంటూ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ ఆలోచన సామర్ధ్యం కోల్పోయారని.. కేసీఆర్‌ను ఇండియా కూటమి మెడపట్టి గెంటేసిందని ఎద్దేవా చేశారు. తాము రూ.4 వేల పెన్షన్ ఇస్తామంటే, ఎలా సాధ్యమని ప్రశ్నించారని.. మరి మీరు ఎలా ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హామీ ఇస్తే అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కర్నాటకలో డబ్బులు పట్టుకుంటే మాకేం సంబంధమని రేవంత్ నిలదీశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. 

కేసీఆర్ లెక్క తాము ఉత్తుత్తి హామీలు ఇవ్వమని ఆయన చురకలంటించారు. మేనిఫెస్టోతోనే ఓట్లు అడుగుతామని ప్రమాణం చేసే దమ్ము కేసీఆర్‌కు వుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఈ నెల 17న అమరవీరుల స్థూపం వద్దకు రావాలని సవాల్ విసిరారు. ఇద్దరం ఎన్నికల్లో డబ్బులు, మందు పంచనని ప్రమాణం చేద్దామన్నారు. కేసీఆర్‌లో పస తగ్గిందని, ఆయనకు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని.. ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని శేష జీవితం హాయిగా గడపాలంటూ రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యంతో పాటు రాస్ట్ర ఆర్ధిక పరిస్ధితి కూడా క్షీణించిందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 1న ఉద్యోగులకు వేతనం వేయ్యాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 

click me!