మహాకూటమి ఉన్నా... లేకున్నా గెలుపు మాదే : కేసీఆర్, కేటీఆర్‌లకు కోమటిరెడ్డి సవాల్

By Arun Kumar PFirst Published Oct 5, 2018, 2:47 PM IST
Highlights

తెలంగాణలో మహాకూటమి వున్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండడానికి మాత్రమే కూటమి ఏర్పడుతోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశాడు.   

నల్గొండ జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ నల్గొండ సభలో చెప్పినట్లు టీఆర్ఎస్ పార్టీ 12 స్థానాల్లో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పది అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇలా జరగకుంటే తన అన్ని పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోడాని సిద్దమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేసీఆర్, కేటీఆర్ లు రాజకీయ సన్యాసం తీసుకోడానికి సిద్దమా అంటూ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. 

తెలంగాణలో మహాకూటమి వున్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండడానికి మాత్రమే కూటమి ఏర్పడుతోందన్నారు.  

గురువారం నల్గొండ జిల్లాలో జరిగింది ప్రజా ఆశీర్వాద సభ కాదని జిల్లాను నాశనం చేయడానికి జరిగిన సభ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రూ.1000 కోట్లతో కృష్ణా జలాలను జిల్లాకు తీసుకువస్తే ఈ నీటిని కూడా ప్రస్తుతం రాకుండా చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ ద్వారా సీఎం ఆంధ్రా కాంట్రాక్టర్లను దోచిపెడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. 

నల్గొండ జిల్లాకు అన్యాయం చేసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డి ముందుంటారని విమర్శించారు.  మంత్రి జగదీష్ రెడ్డి, ఆయన అనుచరులు దోచుకోవడానికే దామరచర్ల థర్మల్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్లాంట్ ను మూసివేయిస్తామని హెచ్చరించారు. దోపిడీదారులు, రౌడీలకే కేసీఆర్ టికెట్లు ఇచ్చారని... వారిని గెలిపిస్తే నల్గొండ జిల్లాలో దోపిడీలు, హత్యలే ఉంటాయంటూ కోమటిరెడ్డి ఘాటుగా విమర్శించారు. 

టీఆర్ఎస్ టిడిపి పార్టీతో పొత్తుపెట్టుకున్నపుడు ఇదే చంద్రబాబు నాయుడిని కేసీఆర్ వీరుడు, శూరుడు అని పొగిడాడని గుర్తు చేశారు. తెలంగాణకు సీఎం అయ్యాక కూడా కేసీఆర్,చంద్రబాబులు అమరావతిలో గంటల గంటలు మాట్లాడుకున్నారని అన్నారు. 
 

click me!