పదే పదే యుద్దం చేయమనడం మీకు తగునా.. : మునుగోడులో జనారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

By Sumanth KanukulaFirst Published Sep 3, 2022, 3:40 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చాలా గౌరవం ఇచ్చారని, తనపై చూపించిన అభిమానం  మరువలేనిదని అన్నారు. ఇన్నాళ్లు తాను పార్టీ కోసం ఎంతో శ్రమ పడ్డానని చెప్పారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో శనివారం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనా రెడ్డి మాట్లాడుతూ.. తనకు చాలా గౌరవం ఇచ్చారని, తనపై చూపించిన అభిమానం  మరువలేనిదని అన్నారు. ఇన్నాళ్లు తాను పార్టీ కోసం ఎంతో శ్రమ పడ్డానని చెప్పారు. ఇక తనను ఆయాస పెట్టొద్దని కోరారు. ప్రజలకు కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు తోడుగా ఉండాలనేదే తన అభిమతం అని చెప్పారు. అయితే ఇన్నాళ్లు యుద్దం చేసిన తనను పదే పదే యుద్దం చేయమనడం తగునా అంటూ పార్టీ శ్రేణులతో అన్నారు. 

కాంగ్రెస్ శ్రేణులు ముందుకు సాగాలని.. అందుకు అవసరమైన అండదండలు అందిస్తానని చెప్పారు. కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు వారిని ఆదుకుంటామని అన్నారు. 

ఇక, మునుగోడులో శనివారం కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసురాజు, మల్లు రవి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ మోసాలపై కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడనేది బహిరంగ రహస్యమేనని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంతో చేసిందన్నారు. కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ధనిక రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక తీర్పు తెలంగాణకు దిక్సూచి కావాలని అన్నారు. 

టీఆర్ఎస్‌, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ బలమేంటో పార్టీ శ్రేణులు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. మునుగోడులో తమను ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు.
 
రజాకార్లపై పోరాటం చేసినప్పుడు బీజేపీ ఎక్కడుందని విమర్శించారు. సెప్టెంబర్ 17ను ఏడాది పాటు జరుపుకోవాలని అన్నారు. 8 ఏళ్లుగా కేసీఆర్ ఎవరికి లొంగిపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలనేది కాంగ్రెస్ కోరిక అని చెప్పారు. 

click me!