Latest Videos

రేవంత్ రెడ్డి పదవులపై జగ్గారెడ్డి కన్ను... అదిమాత్రం ఖాయమట..!!

By Arun Kumar PFirst Published Jun 29, 2024, 2:21 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షులు ఎవరవుతారన్న చర్చ జరుగుతున్నవేళ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్ద వున్న పదవులన్ని తనకు దక్కుతాయని ధీమా వ్యక్తం చేసారు. 

Telangana Congress President : తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ ది కీలక పాత్ర... తమ పార్టీ లేకుంటే అసలు  రాష్ట్ర ఏర్పాటే సాధ్యమయ్యేది కాదని కాంగ్రెస్ నాయకులు అంటుంటారు. ఇలా తెలంగాణ ప్రజల చిరకాల కలను నెరవేర్చిన కాంగ్రెస్ కు అధికారంలోకి వచ్చేందుకు పదేళ్ల నిరీక్షణ తప్పలేదు. చివరకు రేవంత్ రెడ్డి సారథ్యలో కేసీఆర్ తో పోరాడితేగానీ కాంగ్రెస్ కు అధికారం దక్కలేదు. ఇలా కాంగ్రెస్ గెలుపులో పిసిసి చీఫ్ గా రేవంత్ పాత్ర మరిచిపోలేనిది. అలాంటి సక్సెస్ ఫుల్ నాయకుడి స్థానంలో కొత్తవారిని కూర్చోబెట్టాలంటూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసమే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నూతన పిసిసి చీఫ్ ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. 

రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా బిజీగా వున్నారు... కాబట్టి పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని కాంగ్రెస్ అదిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గత నాలుగైదు రోజులపాటు సీఎం రేవంత్ తో పాటు కీలక మంత్రులంతా డిల్లీలోనే వున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులతో ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. తెలంగాణ పిసిసి అధ్యక్ష ఎంపికపై వారితో చర్చించి ఎవరయితే బావుంటుందో సూచించాలని కోరినట్లు సమాచారం. ఇలా వీరు సూచించిన వారిలో ఎవరో ఒకరికి పిసిసి పదవి దక్కే అవకాశాలున్నాయి. 

అయితే ఇలా తెలంగాణ పిసిసి చీఫ్ రేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ వేదికగానే సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని జగ్గారెడ్డి స్పష్టం చేసారు. పిసిసి పదవి ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని  అన్నారు. తమ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి వుంటానని జగ్గారెడ్డి అన్నారు. 

అయితే ఇప్పుడు కాకపోయినా పదేళ్లకయినా తాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానని జగ్గారెడ్డి తెలిపారు. కేవలం పిసిసితోనే ఆగిపోను... రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అవుతానని అన్నారు. ఇప్పటికయితే రాహుల్ గాంధీ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తాను... చివరకు అటెండర్ గా పనిచేయమన్నా పార్టీ కోసం చేయడానికి సిద్దమేనని జగ్గారెడ్డి తెలిపారు. 

జగ్గారెడ్డి మాటలను బట్టిచూస్తే ఆయన తెలంగాణ పిసిసి రేసులో లేరని అర్థమవుతుంది. ఆయన పేరు కూడా కాంగ్రెస్ అదిష్టానం పరిశీలనలో లేదని తెలుస్తోంది. అంతేకాదు భవిష్యత్ సీఎం తానే అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసాయి.  
 
తెలంగాణ పిసిసి రేసులో వున్నది వీరే..: 

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మైనారిటీ,ఎస్సీ ఎస్టీ వర్గాలకు దగ్గరయ్యింది... అలాగే ఓసిల్లో మెజారిటీ సామాజికవర్గం రెడ్డిలు ఆ పార్టీ వెంటే వున్నారు. కానీ బిసి వర్గాలకు ఆ పార్టీ దగ్గరకాలేకపోతోంది. దీంతో ఈసారి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఓ బిసి నేతకు అప్పగించే యోచనలో ఆ పార్టీ అదిష్టానం వున్నట్లు సమాచారం. 

దీంతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ బిసి నాయకుల పేర్లు అధ్యక్ష రేసులో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ లలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. అలాగే బిసి ఎంపీ సురేష్ షెట్కార్ పేరు కూడా అధ్యక్ష రేసులో వుంది. 

ఇక బిసిలకు కాకుండా కాంగ్రెస్ లో బలమైన సామాజికవర్గం రెడ్డి లకే మరోసారి పిసిసి పదవి దక్కే అవకాశాలున్న ప్రచారమూ జరుగుతోంది. సీనియర్ నాయకుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డికి పిసిసి పదవిని ఆశిస్తున్నారు.తమ్ముడి తరపున అన్న డిల్లీ పెద్దలవద్ద లాబీయింగ్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయన కాకుంటే మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో పోటీచేసిఓ ఓడిన వంశీచంద్ రెడ్డికి దక్కొచ్చంటున్నారు. ఇక జగ్గారెడ్డి పేరుకూడా ఈ రేసులో వున్న ఆయనకు దక్కే అవకాశాలు లేవని అర్థమవుతోంది.

ఇక బలహీనవర్గాలు ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలనుకుంటే ముందుగా వినిపించే పేరు భట్టి విక్రమార్క. ఇప్పటికే కర్ణాటకలో డికె శివకుమార్ మాదిరిగానే మంత్రిగా కొనసాగిస్తూనే పార్టీ బాధ్యతలు అప్పగించాలని భట్టి వర్గం కోరుతోంది. ఇక మరో మంత్రి దామోదర రాజనర్సింహ పేరు కూడా పిపిపి రేసులో వుంది. ఇక ఎస్టీల్లో మంత్రిి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మైనారిటీల్లో షబ్బీర్ అలీ పేర్లు పిసిసి అధ్యక్షుడిగా అదిష్టానం పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. 

 

 

click me!