
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పలు రకాల ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమె పాత్ర కూడా ఉందని బీజేపీ నేతలు ఆరోపణలు చేయగా.. తాజాగా కవితపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ కవితపై సంచలన ఆరోపణలు చేశారు. లైగర్ సినిమాలో కవిత పెట్టుబడి పెట్టారని.. బ్లాక్‌మనీని వైట్ చేసుకోవాలని ఈ విధంగా చేశారని జడ్సన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదులో కోరారు. ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం జడ్సన్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా విడుదలైందని.. ఇందులో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా నటించారని చెప్పారు. ఈ సినిమా నష్టపోతే తాము అయిపోతామని చార్మి స్టేట్‌మెంట్ ఇచ్చిందన్నారు. బాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ సినిమా నిర్మాణంలో ఉన్నారని.. ఇంత డబ్బు ఏం చూసి పెట్టారని ప్రశ్నించారు.
ఇటీవల తెలుగులో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్‌తో ఎమ్మెల్సీ కవిత ఒక మీటింగ్ పెట్టి.. విజయ దేవరకొండతో పాన్ ఇండియా సినిమాలు తీయాలని వాళ్లకు ఆదేశాలు ఇచ్చారా? లేదా? అని ప్రశ్నించారు. ఇంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఫ్లాప్ అయితే ఇంత నష్టాన్ని ఎవరు భరించారన్నది తెలియాల్సి ఉందన్నారు. ఇటీవల విజయ్ దేవరకొండను కవిత తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడిందని చెప్పుకొచ్చారు. తన దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు కవిత లైగర్ సినిమాలో భారీగా పెట్టుబడులు పెట్టిందని ఆరోపించారు. ఇది తమ ఆరోపణ కాదని.. సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీకి, సీబీఐకి ఫిర్యాదు చేశామని చెప్పారు.
‘‘2017లో డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులను పిలిచి విచారించారు. ఆకున్ సబర్వాల్ ఈ కేసును విచారించారు. అయితే తర్వాత ఆ కేసు మూతపడింది. ఆ కేసులో పూరీ జగన్నాథ్, ఛార్మీ, నవదీప్, చోట కె నాయుడు.. ఉన్నారు. అక్కడి నుంచి పూరీ, ఛార్మీకి కవితతో పరిచయం పెరిగింది. లైగర్ సినిమా ఫ్లాప్ అయిన ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే.. బ్లాక్‌మనీని వైట్ చేసుకోవడానికే కవిత సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారు’’ అని జడ్సన్ ఆరోపించారు.