టీ కాంగ్రెస్‌లో పరిణామాలపై హైకమాండ్ ఫోకస్.. రేపటి సీనియర్ల భేటీపై ఉత్కంఠ..!

By Sumanth Kanukula  |  First Published Dec 19, 2022, 1:55 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. అసంతృప్తితో ఉన్న నేతలతో సమావేశం కావాలని ఇంచార్జ్ కార్యదర్శులకు హైకమాండ్ సూచించినట్టుగా తెలుస్తోంది.


తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. టీపీసీసీ కమిటీల ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చిచ్చు పలు మలుపులు తిరుగుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సీనియర్లు ఏకతాటిపైకి వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ..  వలసవచ్చిన నేతలతో అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతుందని ఉమ్మడిగా గళం వినిపించారు. తాము ఒర్జినల్ కాంగ్రెస్‌ అని.. పార్టీ కాపాడుకునేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యాక్రమం చేపడతామని తెలిపారు. మరోవైపు ఆదివారం గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ సమావేశానికి కూడా భట్టి విక్రమార్క నివాసంలో సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేతలు హాజరుకాలేదు. 

మరోవైపు సీనియర్ నేతలు చేసిన కామెంట్స్‌కు.. రేవంత్ వర్గం నేతలు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ బ్యాగ్రౌండ్ ఉన్న 12 మంది నేతలు పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. తాము పదవుల కోసం ఆశపడటం లేదని.. పార్టీ బాగు కోసం కృషి చేస్తామని తెలిపారు. తాము కాంగ్రెస్‌లో చేరి నాలుగేళ్లు దాటిందని.. ఇంకా వలసనేతలు, టీడీపీ అని అనడటం ఏమిటని సీనియర్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. 

Latest Videos

అయితే ఈ పరిణామాలను తెలంగాణ ఇంచార్జ్ కార్యదర్శులు కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదికలు ఇచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుంది. అసంతృప్తితో ఉన్న నేతలతో సమావేశం కావాలని ఇంచార్జ్ కార్యదర్శులకు హైకమాండ్ సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న నదీమ్‌ జావిద్‌.. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సీనియర్ నేతలు మాత్రం పట్టువీడటం లేదు. ఇక, పార్టీలో సమస్యలు ఉంటే ఢిల్లీకి వచ్చి చెప్పాలని సీనియర్లకు హైకమాండ్ సూచించినట్టుగా తెలుస్తోంది. అలాగే సమస్యలు ఉంటే మీడియా ఎదుట మాట్లాడవద్దని చెప్పినట్టుగా సమాచారం. 

మరోవైపు మంగళవారం మరోసారి సమావేశం కావాలని సీనియర్లు నిర్ణయించారు. రేపు సాయంత్రం 4 గంటలకు మహేశ్వర్ రెడ్డి నివాసంలో భేటీ కావాలని వారు నిర్ణయం తీసుకనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదించాల్సిన అంశాలకు సంబంధించిన అజెండాను ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమైన నేతలే కాకుండా.. మరికొంతమంది సీనియర్ నేతలను కూడా ఈ సమావేశంలో పాల్గొనేలా ప్రయత్నాలు  జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్‌గానే ఈ భేటీ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

ఇక, పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో ఆయన రేపటి సమావేశానికి హాజరవుతారా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించిన నేపథ్యంలో.. రేపటి భేటీపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేశ కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లతో సంప్రదింపులు జరిపి రేపటి భేటీ జరగకుండా చూస్తుందా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది. 
 

click me!