
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఈ నెల 20వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. కొల్లాపూర్‌లో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సోమవారం వివరాలు వెల్లడించారు. జులై 20న కొల్లాపూర్‌లో ప్రియాంక గాంధీ సమక్షంలో జరిగే బహిరంగ సభలో టీపీసీసీ మహిళా డిక్లరేషన్‌ను ప్రకటిస్తామని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్న ఆ పార్టీ అధిష్టానం.. పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కర్ణాటకలో ప్రచారం ముగిసిన వెంటనే ప్రియాంక గాంధీ సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన సభలో పాల్గొని యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఇక, జూలై 2వ తేదీన రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభకు హాజరుకాగా.. ఆయన సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీతో పాటు మరికొందరు హస్తం కండువా కప్పుకున్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్‌ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా వృద్ధులకి, వితంతువులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ తీసుకొచ్చేలా.. ఖమ్మంలో నిర్వహించిన సభ కంటే కొల్లాపూర్‌లో మరింత పెద్దగా సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఆయా ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నేతలు భావిస్తున్నారు.
ఇక, కొల్లాపూర్‌లో నిర్వహించే సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వారిలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి, గద్వాల్ జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడంగల్ గురునాథ్ రెడ్డి ఉన్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో జూపల్లి కృష్ణారావు సమావేశమై చర్చించారు.
ఇక, ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించి చర్చించినట్లు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సోమవారం తెలిపారు. ఖమ్మం కంటే ఈ సభను విజయవంతం చేస్తామని.. పార్టీ క్యాడర్‌కు ఊపు వస్తుందని చెప్పారు. తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని.. అది స్పష్టంగా కనిపించిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎదుర్కొగలదని చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.