మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్: రాజగోపాల్ రెడ్డిపై బహిష్కరణ వేటు..?

By Siva KodatiFirst Published Jun 24, 2019, 9:11 AM IST
Highlights

పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుండటంతో పాటు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం కన్నెర్ర చేసింది. 

పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుండటంతో పాటు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం కన్నెర్ర చేసింది. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ చర్యలకు సిద్ధమైంది.

ఏకంగా పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తే రాజకీయ ఫిరాయింపు చట్టం వర్తించదని పలువురు సీనియర్లు చెప్పడంతో దీనిపై న్యాయ సలహా తీసుకుని హస్తం పెద్దలు భావిస్తున్నారు.

ఆదివారం రాత్రి హైదరాబాద్‌ గొల్కొండ హోటల్‌లో జరిగిన పీసీసీ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ ఫిరాయింపులపై ప్రధానంగా చర్చించారు.  పార్టీ మారే విషయంలో కఠినంగానే వ్యవహారించాలని నేతలు నిర్ణయించారు.

రాజగోపాల్ రెడ్డి విషయంలో ఆలస్యం చేయడం మంచిది కాదని.. ఆయన ఎలాగో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నందున ఏ మాత్రం సహించవద్దని.. అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరించాలని పలువురు నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. 

click me!