
కరీంనగర్: మహిళా ఎంపీడీవోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మరోషాక్ తగిలింది. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మాజీకి ఫిర్యాదు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లెప్రగతి గ్రామ సభలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి.. మహిళా ఎంపీడీవోతో అసభ్యకరంగా ‘‘ఎంపీడీవో గారు.. మీరు బాగానే ఊపుతున్నారు. కానీ ఈమె ఇక్కడ ఊపడం లేదు’’ అని అనుచితంగా మాట్లాడారు.
మంత్రి వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బక్క జడ్సన్.. వెంటనే వెబ్‌సైట్ లింక్‌ను జత చేస్తూ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖాశర్మాజీకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ట్వీట్‌ను తెలంగాణ సీఎంవో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు మరి కొందరికి ట్యాగ్ చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఘటన మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం ఘటనను గుర్తు చేస్తోందని బక్క జడ్సన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గ్రామ సభలో ఉన్న నాయకులు, అధికారులు సైతం మంత్రి వ్యాఖ్యలను ఖండించకపోగా.. నవ్వులు చిందించారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా అధికారి అనికూడా చూడకుండా, ఆమె పరువుకు భంగం కలిగేలా గ్రామసభలో అనుచిత వ్యాఖ్యాలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై చర్యలు తీసుకోవాలని బక్క జడ్సన్ కోరారు.
ఆ సంఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. కొన్ని వర్గాలు ఉద్దేశ్యపూర్వకంగా సంచలనం కోసం ప్రయత్నిస్తున్నాయని, వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఉద్యోగులపై, అధికారులపై తనకు గౌరవం ఉందని ఆయన అన్నారు. ఆ మహిళా అధికారి కుటుంబంతో తనకు ఉన్న సన్నిహిత సంబంధంతోనే బాగున్నావా బిడ్డా అంటూ పలకరించానని ఆయన చె్పపారు.
"
ఆ తర్వాత గ్రామంలో పారిశుధ్య నిర్వహణలో ఉన్న లోపాలపై, పచ్చదనం పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాల అమలుపై ఆరా తీశానని, తెలంగాణ ఉచ్చారణలో భాగంగా మీరు బాగా ఉరికి పనిచేస్తున్నారని, ఇంకా అందరినీ ఉరికించి పనిచే చేయించాలని ప్రోత్సహించానని ఆయన చెప్పారు. కొందరు దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అది వాంఛనీయం కాదని ఎర్రబెల్లి అన్నారు.