తెలంగాణలో తుఫాన్ ఖాయం: రాహుల్

By narsimha lodeFirst Published Dec 5, 2018, 3:49 PM IST
Highlights

కొన్ని రోజుల్లో తెలంగాణలో ఒక విస్పోటనం రానుందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.మార్పు అనే తుఫాన్  వస్తోందని రాహుల్ చెప్పారు.


కోదాడ: కొన్ని రోజుల్లో తెలంగాణలో ఒక విస్పోటనం రానుందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.మార్పు అనే తుఫాన్  వస్తోందని రాహుల్ చెప్పారు.

బుధవారం నాడు కోదాడలో నిర్వహించిన ప్రజా కూటమి ఎన్నికల సభలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ గాంధీ  పాల్గొన్నారు. టీడీపీ చీఫ్  చంద్రబాబుతో కలిసి రాహుల్  ఈ సభలో  పాల్గొన్నారు.

తెలంగాణ వస్తే  తమ భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ ప్రజలు ఎన్నో కలలుగన్నారని రాహుల్ గాంధీ చెప్పారు. టీఆర్ఎస్ అధికారాన్నిచేపట్టాక  ప్రజల కలలన్నీ  కల్లలుగా మారాయన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు  ఎన్నో పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత తమ రక్తాన్ని ధారపోశారన్నారు.

జిల్లాలను దత్తత తీసుకొంటానని ప్రకటన  చేస్తున్న కేసీఆర్... తెలంగాణ రైతులను, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను దత్తత తీసుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు.

టీఆర్ఎస్ పాలనలో 4వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని  రాహుల్ చెప్పారు. బాధిత కుటుంబాలను కేసీఆర్ దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు. నల్గొండ జిల్లాలోని  ప్రజలు ఇంకా ఫ్లోరైడ్ నీళ్లు తాగాలా అని రాహుల్ ప్రశ్నించారు.

ప్రజా కూటమి అధికారంలోకి రాగానే  శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునర్నిర్మించి నల్గొండకు సాగునీరు అందిస్తామని  రాహుల్ గాంధీ  హమీ ఇచ్చారు.గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హమీలను  కేసీఆర్ అమలు చేయలేదన్నారు. కేసీఆర్ ను  పదవి నుండి దించాలని ప్రజలు నిర్ణయం తీసుకొన్నారని రాహుల్ గాంధీ చెప్పారు.

ప్రజా కూటమి అధికారంలోకి రాగానే  రైతులకు రూ. 2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామన్నారు.నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను  కల్పిస్తామని రాహుల్ హమీ ఇచ్చారు.లోక్ సభ ఎన్నికల్లో మోడీని కూడ ఇంటికి పంపుతామని  రాహుల్ గాంధీ ధీమాను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందే:చంద్రబాబు

 

click me!