మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. మరో రెండు రోజుల్లో ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టు సమాచారం.
హైదరాబాద్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఆయనకు, ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లుతానని వివరించారు. సోనియా గాంధీ సమక్షంలోనే హస్తం పార్టీలోకి చేరుతానని తెలిపారు. ఈ నెల 27న ఢిల్లీలో ఆయన పార్టీలోకి చేరబోతున్నట్టు సమాచారం.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకు గౌరవం అని మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. వారి నుంచి తాను ఎన్నో ఆదర్శాలను నేర్చుకున్నట్టు వివరించారు. అంతేకాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హైదరాబాద్‌లో సోనియా గాంధీతో ఓ సభ ఉంటుందని తెలిపారు.
undefined
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు పంపినట్టు వివరించారు. తాను మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్‌ను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. పార్టీలో తనకు ఇచ్చిన అన్ని హోదాలను తొలగించాలని, అభ్యర్థుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరారు. తన మద్దతుదారులు, కార్యకర్తలు, సన్నిహితులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు.
Also Read: మైనంపల్లి ఇంటికి కాంగ్రెస్ నేతల క్యూ.. హస్తం గూటికి చేరేందుకు ముహుర్తం ఖరారు..
2014లో తాను బీఆర్ఎస్‌లో చేరినప్పుడు జీహెచ్ఎంసీలో ఒక్క కార్పొరేటర్ లేడని, తాను 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపించానని మైనంపల్లి వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా తన కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తాను నిరాశ చెందారని, ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. గతంలో అందించిన సహకారం, మద్దతుకు ధన్యవాదాలు అని తన రాజీనామా లేఖలో మైనంపల్లి పేర్కొన్నారు.