
తెలంగాణ పోలీసుల ‘పట్టు’ పరిశ్రమ బాగానే విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. స్వామి భక్తిని ప్రదర్శించడంలో అన్ని శాఖలకంటే వీళ్లే కాస్త ఎక్కువే మార్కులు కొట్టేస్తున్నారు.మొన్న నయిం ఎన్ కౌంటర్ తర్వాత అసలు పోలీసులకు ఆ గ్యాంగ్ స్టర్ కు సంబంధాలే లేవు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిన్న నయిం తో పోలీసులు దిగిన ఫోటొలు వెలుగు చూసినా హోం మంత్రి నాయిని లైట్ తీసుకున్నారు. దినపత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా పోలీసులపై చర్య తీసుకోలేమని వారినే వెనకేసికొచ్చారు.
అధికార పక్షం అంతగా తమను వెనకేసికొస్తుంటే పోలీసులు కూడా అదే స్థాయిలో స్వామి భక్తిని ప్రదర్శించుకోడానికి వెనకాడటం లేదు.
అందుకు మచ్చుకో ఉదహారణ ఇది...
మహబూబ్ నగర్ జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలో పోలీసు స్టేషన్ ను ఇటీవల కాస్త రంగులతో అలంకరించారు.
మామూలుగా ఏ ప్రభుత్వ కార్యాలయానైనా తెలుగు లేదా పసుపు రంగులతో పేయింట్ వేస్తారు. కానీ, ఇక్కడి పోలీసులు మాత్రం తమ స్టేషన్ ను గులాబీ రంగుతో ఎంతో చక్కగా అలంకరించారు.
అది అధికార పార్టీ కలర్ కావడంతో ఆ రంగు కాస్త రాజకీయరంగు పులముకుంది. ఇంకేముంది స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే పోలీసు స్టేషన్ ముందు బయిటాయించి నిరసన తెలిపారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి కూడా అక్కడికి వచ్చి స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు తమ పార్టీ గుర్తైన మూడు రంగులను వేసేలా ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ విషయం అక్కడ ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు లేదో...