తిరిగి కాంగ్రెస్ లోకి రండి.. బీజేపీలో చేరిన నేతలకు రేవంత్ రెడ్డి పిలుపు

By Mahesh Rajamoni  |  First Published May 19, 2023, 9:35 AM IST

Hyderabad: తెలంగాణ‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ని ఓడించేందుకు బలమైన శక్తిని నిర్మించుకోవాలంటే బీజేపీలోకి వెళ్లిన నేత‌లు తిరిగి కాంగ్రెస్ లో చేరాలని తెలంగాణ పీసీసీ చీఫ్, ఏంపీ ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
 


TPCC president Revanth Reddy: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉర‌క‌లేస్తోంది. వ‌చ్చే ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోకి ఫిరాయించిన నేతలంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎంపీలు జీ.వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి కొందరు సీనియర్ నేతలు గతంలో తమ సొంత రాజకీయ ఒత్తిళ్లతోనే కాంగ్రెస్ ను వీడారని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి నేత ఈటల రాజేందర్ విషయంలోనూ అదే జరిగిందన్నారు. 

నిజానికి ఈ నేతలు కాషాయ భావజాలంపై నమ్మకంతో బీజేపీలో చేరలేదనీ, సొంత కారణాలతోనే బీజేపీలో చేరారన్నారు. బీజేపీలో చేరితే తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు భావించి ఉండవచ్చునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని బీఆర్ఎస్ ను ఓడించేందుకు బలమైన శక్తిని నిర్మించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని పీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. పీసీసీ నాయకత్వంతో కొందరు నేతలకు సమస్యలు ఉండవచ్చునని ఆయన అన్నారు. కానీ క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగుతూ విజ‌యం సాధిస్తామ‌ని తెలిపారు. భవిష్యత్తులో తమకు సమస్య వస్తుందని వారు భావిస్తే వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఒక అడుగు కాదు 10 అడుగులు వేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను పార్టీ బాస్ ను కానందున త‌న గురించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదనీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే మాత్రమే పార్టీకి అసలైన బాస్ లు అని స్పష్టం చేశారు.

Latest Videos

రేవంత్ పిలుపుపై వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి, రాజేందర్ వెంటనే స్పందించకపోగా, రాజగోపాల్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించారు. తాను బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాను పనిచేయలేనని ఆయ‌న స్పష్టం చేశారు. అయితే, కర్ణాటక ఎన్నికల తర్వాత కొందరు మిత్రులు తనను తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని సలహా ఇచ్చారని ఆయన అంగీకరించారు. కానీ తాను అలా చేయనని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణలో కూడా గెలుస్తుందన్న గ్యారంటీ లేదన్నారు.

click me!