ప్రజల స్వేచ్ఛను ఏడో హామీగా ఇచ్చామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా బానిస మనస్తత్వాన్ని కొందరు నేతలు వదులుకోవడం లేదని , తమ ప్రభుత్వానికి ఎవరైనా ఎప్పుడైనా సూచనలు ఇవ్వొచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోలా పరిపాలన చేస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
ప్రజల స్వేచ్ఛను ఏడో హామీగా ఇచ్చామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. శాసనమండలిలో ఆయన శనివారం ప్రసంగిస్తూ జైపాల్ రెడ్డి కృషితోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రగతి భవన్ గేట్లు బద్ధలుకొట్టామని, ఇంకా బానిస మనస్తత్వాన్ని కొందరు నేతలు వదులుకోవడం లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రభుత్వం అంటే పాలక పక్షం, ప్రతిపక్షం అన్నారు.
తమ ప్రభుత్వానికి ఎవరైనా ఎప్పుడైనా సూచనలు ఇవ్వొచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు. పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత తమదేనని, గతంలో పేదలకు ఆరోగ్య శ్రీ అందలేదని సీఎం అన్నారు. ఇప్పుడు ప్రజావాణిని వింటున్నామని, ప్రజావాణితో మార్పును తెచ్చామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోలా పరిపాలన చేస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. స్వేచ్ఛ కోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇంతకాలం బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతూ వచ్చారని, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ 10వ స్థానంలో వుందన్నారు. రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో వుందని, రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో వుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి సరైన ప్రణాళిక లేదని సీఎం పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. కానీ ఇప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అదే వెనుకబాటుతనం వుందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మురికికూపంగా మారిన మూసీని ప్రత్యేక కారిడార్‌గా చేస్తామని.. స్వచ్ఛమైన జీవనదిగా మారుస్తామని ఆయన తెలిపారు.
అంతకుముందు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. పల్లీ బఠానీలను అమ్మినట్లు ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ , లిక్కర్ విచ్చలవిడిగా వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారులు సీజ్ చేసిన పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఇకపై డ్రగ్స్ అనే పదం వినిపించొద్దని అధికారులను ఆదేశించానని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ కేసుపై సిట్ వేయాలని తాను డిమాండ్ చేశానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. డ్రగ్స్ వ్యవస్ధను కూకటివేళ్లతో పెకిలించాల్సిందిపోయింది.. ఎందుకు నిర్లక్ష్యం వహించారని ఆయన నిలదీశారు.
యువత, మహిళలు డ్రగ్స్ బారినపడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ వాడితే కాళ్లు వణకాలన్నారు. తాము చరిత్ర తవ్వడం మొదలుపెడితే మీరు తట్టుకోలేరని సీఎం కౌంటరిచ్చారు. పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని అసమర్ధులని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నష్టపోయేలా చేశారని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ డ్రగ్స్‌కి అడ్డాగా మారిందన్నారు. ప్రశ్నాపత్రాల లీక్ బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. జోనల్ విధానాన్ని వ్యతిరేకించినందుకు ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే పదేళ్లు తామే అధికారంలో వుంటామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు , యువత ఎడిక్ట్ అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఎస్ న్యాబ్ అనేది పేపర్ల మీద వున్న వ్యవస్ధ అన్నారు. మీరే ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారు, మీరే గుర్తించారు, మీరే పట్టుకున్నారు.. కానీ బలైంది ఎవరు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు ఆనాడు సోనియా ఇచ్చిన హామీని ఎన్ని కష్టాలు వచ్చినా నిలబెట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు. డ్రగ్స్ విషయంలో రాజకీయాలు చేస్తే సమాజం క్షమించదన్నారు. టీఎస్ న్యాబ్ ఏర్పాటు చేసి దానిని వారే నిర్వీర్యం చేశారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
దీనిని సమూలంగా నిర్మూలించడానికి విపక్ష పార్టీలు సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ , మీకు వాటాల్లో తేడా వల్లే బయటపడిందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రజలు నమ్మారని.. మేం పాలకులం కాదు, సేవకులమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.