చీమలు పెట్టిన పుట్టలో పాములా దూరాడు.. ఆయన ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Dec 16, 2023, 6:20 PM IST

అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం అని సెటైర్లు వేశారు. ఎ


అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ఎన్నారైలు వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా మాట్లాడుతారని అనుకున్నానని.. కానీ అది కొంతమందికి సాధ్యం కాదన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను ఏకవచనంతో మాట్లాడారని.. తెలంగాణను వ్యతిరేకించిన వారిని గారు గారు అని మాట్లాడినప్పుడే రేవంత్ రెడ్డి పరిజ్ఞానం, సంస్కారం అర్ధమైందని కేటీఆర్ విమర్శించారు. 

చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్లు .. కాంగ్రెస్‌లో భట్టి విక్రమార్క, శ్రీధర్, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీరంతా కలిసి పెట్టిన పార్టీలో దూరి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చెండాలంగా వుంటుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. అయితే కేటీఆర్ ప్రసంగానికి దామోదర రాజనర్సింహ స్పందించారు. హైకమాండ్ నిర్ణయానికి శిరసా వహిస్తామని చెప్పారు. 

Latest Videos

undefined

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం అని సెటైర్లు వేశారు. ఎన్ఆర్ఐల పట్ల సీఎంకు వున్న ప్రేమను ఎన్ఆర్ఐలు గమనించాలన్నారు. వందల కోట్ల మంది భారతీయులను కాదని బయటి దేశం వాళ్లను తీసుకొచ్చి అధ్యక్షులను చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని కేటీఆర్ దుయ్యబట్టారు. 2009 నుంచి 2013 మధ్య కాంగ్రెస్ అధికారంలో వున్న సమయంలో 8,198 మంది రైతులు కరెంట్ షాకుతో చనిపోయారని గుర్తుచేశారు. విద్యుత్ రంగం గురించి గవర్నర్ అవాస్తవాలు మాట్లాడారని ఆయన విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో వలసలు బంద్ అయ్యాయని.. రాష్ట్రంలో వరి నాట్ల కోసం 14 రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. 

ఫ్లోరోసిస్ నుంచి నల్లగొండ ప్రజలకు కేసీఆర్ విముక్తి కల్పించారని.. ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా కేంద్రం ప్రకటించిందన్నారు. రూ.200 వున్న పెన్షన్‌ను రూ.2 వేలు చేశామని .. జాతీయ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం గెలుచుకున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఓట్ల కోసం బస్సులు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని చెప్పారంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 

click me!