CM Revanth Reddy |కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డికే తన సపోర్టు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యర్ధి అని, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy | కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డికే తన సపోర్టు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యర్ధి అని, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం నాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ అనే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో కేసీఆర్ కావాలని వైఎస్ జగన్ భావిస్తే.. ఏపీలో కాంగ్రెస్ గెలవాలని తాను కోరుకున్నానని, అలాగే.. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆయన కోరుకుంటే.. తాను రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాబట్టి రాజకీయంగా తామిద్దరం ప్రత్యార్థులమేనని అన్నారు.
ఏపీ రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కర్ణాటక, తమిళనాడు రాజకీయాలు ఎలాగో... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా అదే ద్రుష్టితో చూస్తానని అన్నారు. ఇతర రాష్ట్రాల రాజకీయాల విషయంలో తాను స్పందించడం లేదని, ఏపీ విషయంలోనూ అంతేనని అన్నారు. ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారనీ, వారు అక్కడి పరిస్థితి గురించి స్పందిస్తారన్నారు. విభజన అంశాలపై మాత్రం జగన్‌ను కలిసేందుకు తాను సిద్ధమని చెప్పారు.
షర్మిలకే నా సపోర్టు
షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబోతుందని తెలుస్తోందని, అప్పుడు తాను ఆమెకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యేషర్మిలకు తన సహకారం ఉంటుందనీ, తమ మధ్య విభేదాలు సృష్టించవద్దని అన్నారు. తెలంగాణ నుంచి ఆమెను పంపించడంలో విజయవంతం అయ్యామని తనని పాయింట్ అవుట్ చేయడం సరికాదని అన్నారు. రెండు రాష్ట్రాల విషయానికి వస్తే కేసీఆర్, జగన్ ఒకటేనని, తాను, షర్మిల ఒకటని అన్నారు. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ కలిసి పోటీ చేస్తే ఎలా? అని ప్రశ్నించగా.. తనకు ఏపీ రాజకీయాలతో అసలూ సంబంధం లేదనీ మరోసారి పునరుద్ఘాటించారు. ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ ఉందనీ, అక్కడ నేతలు స్పందిస్తారన్నారు.