ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దరఖాస్తుదారులకు ఫోన్ చేసి సరైన వివరాలు తీసుకుని ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలని పేర్కొన్నారు.
CM Revanth Reddy: ఈ నెల 6వ తేదీతో ప్రజా పాలన కార్యక్రమం ముగిసింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. అందరూ ఊళ్లకు తరలి మరీ దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తు నింపడంపైనా చాలా మందికి సంశయాలు కలిగాయి. మొత్తానికి దరఖాస్తు నింపి అయితే సమర్పించారు. దరఖాస్తులు సమర్పించిన తర్వాత కూడా అరరే ఆ వివరాలను తప్పుగా నమోదు చేశామే.. అనే నాలుక్కరుచుకున్నవారు చాలా మంది ఉన్నారు. అంతేనా, ఆ తప్పుల కారణంగా తమ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందేమోననే భయాలూ ఉన్నాయి. ఈ భయాలకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు.
ప్రజా పాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సవరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ దరఖాస్తులో పేర్కొన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి మరీ ఆ తప్పులను సవరించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని వివరాలు సరిగ్గా తీసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లోకి డేటాను ఎంటర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు కాంగ్రెస్ లీడర్ కస్తూరి నరేంద్ర వివరించారు.
Also Read : TS News: పార్టీ ఓటమికి నేనే బాధ్యుడ్ని: కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ
అయితే, ఇక్కడే మరో చిక్కు కూడా ఉన్నది. ఇటీవలే తాము ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంటర్ చేసే వారిమని పేర్కొంటూ కొందరు సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసిన ఘటన నిజామాబాద్‌లో వెలుగులోకి వచ్చాయి. ఇలా ఫోన్ చేసే ఒక మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ. 10 వేలు కాజేసిన వార్త కూడా కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తు వివరాలను అడిగడానికి ఫోన్ కాల్ చేసింది డేటా ఎంట్రీ ఆపరేటర్లా? లేక సైబర్ మోసగాళ్ల అనేది గుర్తించడం కష్టంగా మారనుంది. అయితే, డేటా ఎంట్రీ ఆపరేటర్లు బ్యాంకు ఖాతాల గురించి, ఓటీపీలను అడగరనే విషయాన్ని గుర్తుంచుకుంటే చాలా ఈ సైబర్ నేరగాళ్ల సమస్యను అధిగమించవచ్చు.