గూడ అంజన్న చివరి కోరిక.. కేసీఆర్‌ను చూడటమే అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, కేసీఆర్ ఆయనను కనీసం పరామర్శించడానికైనా వెళ్లలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ను కలవడానికి గద్దర్‌ను మూడు గంటలపాటు ఎండలో నిలబెట్టారని అన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని, అభిప్రాయాలను తుంగలో తొక్కారని అన్నారు. ప్రగతి భవన్‌కు ప్రజలను రానివ్వనప్పుడు ఆ భవనం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజా పాలన కోసమే కదా.. ఆ భవన్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడిన కొమురం భీం పేర్లతోపాటు అందె శ్రీ, గూడ అంజన్న, గద్దర్ పేర్లను ప్రస్తావించారు.
దొర ఏందిరో.. దొర పీకుడేందిరో అనే గూడ అంజన్న రాసిన పాట తెలంగాణలో ముందు తరాల నోళ్లలో నానింది. దొరల పాలనను ఎదిరించడానికి, ధిక్కరించడానికి ఈ పాటను ఉపయోగించారు. ఈ పాట రాసిన దళిత కవి, సాహిత్యకారుడు గూడ అంజన్న చివరి కోరిక ఏమిటీ? అని రేవంత్ రెడ్డి అడిగారు. ఓ పేపర్ క్లిప్ తీసుకుని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చదివారు.
గూడ అంజన్న చివరి రోజుల్లో హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా.. అప్పటి సీఎం కేసీఆర్ పరామర్శించడానికి వస్తున్నాడనే వార్త వచ్చింది. అప్పుడు గూడ అంజన్న కేసీఆర్ కోసం ఎదురుచూశాడు. కేసీఆర్‌ను చూడాలన్నదే ఆయన చివరి కోరిక అని రేవంత్ రెడ్డి వివరించాడు. కానీ, కేసీఆర్ అక్కడికి వెళ్లలేదు. ఇదే విషయాన్ని భార్య గూడ అంజన్నకు చెప్పిందని వివరించాడు.
తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన పాటలు రాసిన, ప్రజల్లో ఉద్యమ ఊపును తెచ్చిన కవుల్లో ఒకరైన గూడ అంజన్న చివరి కోరిక కేసీఆర్‌ను చూడటం అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, గూడ అంజన్నను పరామర్శించడానికి కేసీఆర్‌కు సమయం దొరకలేదా? అని ప్రశ్నించారు.
Also Read: TS Assembly: 80 వేల పుస్తకాలు చదివిన మేధావి.. అసెంబ్లీలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
గూడ అంజన్న చివరి కోరికగా.. కనీసం వెళ్లి పరామర్శించే తీరిక లేని కేసీఆర్.. ఇతర ఉద్యమకారులను ఎలా ట్రీట్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఉద్యమకారుడు పాడిన జయజయమే పాటనే రాష్ట్ర గేయంగా ఎంచుకున్నామని తెలిపారు. గద్దర్ కేసీఆర్‌ను కలిసి ఒక విజ్ఞప్తిని అందించాలని ఆశించాడని, కానీ, ఆయనను అధికారులు చుట్టుముట్టి లోనికి పంపించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. సుమారు మూడు గంటలపాటు ఎండలో ఆయన నిలబడ్డారని, కానీ, కేసీఆర్‌ను కలిపించలేరని పేర్కొన్నారు.