మహాత్ములు.. ఎన్నో శాపాలు పెట్టారు: ఆరేళ్ల నాటి మాటలను గుర్తుచేసిన కేసీఆర్

Siva Kodati |  
Published : Nov 28, 2020, 06:03 PM IST
మహాత్ములు.. ఎన్నో శాపాలు పెట్టారు: ఆరేళ్ల నాటి మాటలను గుర్తుచేసిన కేసీఆర్

సారాంశం

ఎన్నికలు జరుగుతుంటాయి.. సందర్భాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ తమ విచక్షణాధికారం ఉపయోగించి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్

ఎన్నికలు జరుగుతుంటాయి.. సందర్భాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ తమ విచక్షణాధికారం ఉపయోగించి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

ఒక పార్టీ, ప్రభుత్వం, నాయకుడు ఎలా ఆలోచిస్తూ వున్నారు.. వాళ్ల దృక్పథం, వైఖరి ఎలా వుంది, వాళ్లు ఏ పద్ధతిలో అభివృద్ది గురించి ఆలోచించాలి అనే దానిపై చర్చ జరపాలని కేసీఆర్ సూచించారు.

అలా అయితేనే ప్రజలకే సేవ చేయడంలో పోటీ తత్వం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా సమాజానికి, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్ చైతన్యం వున్న నగరమని, ఎన్నో ఏళ్ల చరిత్ర వుందని, ఎన్నో మంచి చెడులకు సాక్ష్యంగా వున్న నగరమని కేసీఆర్ చెప్పారు.

వాదాలు, చర్చోపచర్చలు, అపోహలు, అనుమానాలు, అనేక విషయాల మధ్య సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందన్నారు. చాలా మంది చాలా అపనమ్మకాలు.. తెలంగాణ వాళ్లు పాలించలేరని, తెలివి తేటలు లేవని, కరెంట్ ఉండదు, రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుందని ఇంకొందరు హేళన చేశారని కేసీఆర్ గుర్తుచేశారు.

ప్రాంతీయ వాదం పెచ్చరిల్లుతుందని, నక్సలైట్లు చెలరేగుతారు, హైదరాబాద్ ఖాళీ అవుతుందని శాపాలు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ఇన్ని అనుమానాలు, అపోహల మధ్య రాష్ట్ర ప్రజానీకం, హైదరాబాద్ ప్రజానీకం టీఆర్ఎస్ పార్టీని నమ్మి, దీవించి అధికారం అప్పగించారని కేసీఆర్ తెలిపారు.

ఇంతకు ముందు కేసీఆర్ ఉద్యమ నాయకుడు, కేసీఆర్ ప్రసంగాలను తెలంగాణ ప్రజలు చెవికోసుకుని వినేవారు, లక్షల మంది సభలకు హాజరయ్యే వారు, భారతదేశమే ఆశ్చర్యపోయే లాంటి సభలు వరంగల్‌లో జరిగాయన్నారు.

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌తో  పాటు చాలా పట్టణాల్లోనూ ఎన్నో సభలు, సమావేశాలు జరిగాయని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ ఉద్యమం గమ్యాన్ని చేరిందని.. ఇప్పుడు కావాల్సింది రాజకీయ పరిణితీ అని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పానన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉండదని.. రాజకీయ పార్టీగా పరిణీతితో పనిచేస్తుందని చెప్పినట్లు కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu