తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం కేసీఆర్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి (తెలంగాణ తిరుమల దేవస్థానం) చేరుకున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 26 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బుధవారం జరుగుతున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్ దంపతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2 కేజీల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ స్వామివారిని అలంకరించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులకు వేదపండితులు వేద ఆశ్వీరచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. ఇక, సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా యంత్రాంగం భారీగా భద్రత ఏర్పాట్లు చేసింది.
ఇక, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థన మేరకు తిమ్మాపూర్‌లోని శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ. 23 కోట్లు మంజూరు చేశారు. మాడ వీధులు, రాజగోపురం, గాలిగోపురం, యాగశాల, కోనేరు, కల్యాణ కట్ట, 54 సూట్‌రూమ్‌లతో కూడిన అతిథి గృహం, కల్యాణ మండపం వంటి ఇతర సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం తరహాలో ఆలయాన్ని పునర్నిర్మించేందుకు వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.