ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు .. పదిసార్లు ఇస్తే ఏం చేశారు : తొలిసభలోనే కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేసీఆర్

By Siva Kodati  |  First Published Oct 15, 2023, 5:28 PM IST

హుస్నాబాద్‌లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్‌కు ఈ రాష్ట్ర ప్రజలు 10 సార్లు అవకాశం కల్పించారని, అప్పుడు ఏం చేశారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 


ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం హుస్నాబాద్ నుంచి కేసీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. 9 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేది, ఇప్పుడు ఎలా వుందని ఆయన కేసీఆర్ ప్రశ్నించారు.

9 ఏళ్ల క్రితం విద్యుత్ కొరత, సాగునీరు , తాగునీరు లేదు, రాష్ట్రం నుంచి ప్రజల వలసలు వుండేవన్నారు. సమస్యలు పరిష్కరానికి కొన్ని నెలల పాటు మేధోమేథనం చేశామని కేసీఆర్ గుర్తుచేశారు. అందరి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని అన్ని అంశాల్లో నెంబర్ వన్‌గా నిలిపామన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మనకు ఎవరూ సాటిరారు.. పోటీ లేరన్నారు. 

Latest Videos

undefined

ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఇలాగే కొనసాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కొన్ని పార్టీలు వచ్చి ఇప్పుడు మాయమాటలు చెబుతున్నాయని విపక్షాలపై మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అడుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు పది, పన్నెండు అవకాశాలు ఇచ్చారని కేసీఆర్ గుర్తుచేశారు. పదికి పైగా అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అంధకారం చేసిందన్నారు. 2014లో రూ.200 వున్న పింఛన్లను రూ.వెయ్యికి పెంచామని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడగానే పింఛన్లను రెట్టింపు చేశామన్నారు. ఎవరూ అడగకుండానే రైతుల కోసం రైతుబంధు తెచ్చామన్నారు. 

రైతుబంధుతో రాష్ట్ర వ్యవసాయ విధానమే మారిపోయిందని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ సరఫరా ఎలా వుండేదో ప్రజలు ఆలోచించాలని సీఎం పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎక్కడా ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలటం లేదన్నారు. ప్రాజెక్ట్‌లు నిర్మించి సాగునీరు, తాగునీరు తెచ్చుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని సీఎం వెల్లడించారు. ప్రాజెక్ట్‌లు, చెక్ డ్యామ్‌లతో భూగర్భ జలాలు పెరిగాయని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యం తరలించేందుకు వేల లారీలు సరిపోవడం లేదన్నారు. మిషన్ భరీరథ లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని కేసీఆర్ తెలిపారు. 
 

click me!