పురుగుల మందుతో మోత్కుపల్లి హల్‌చల్.. ‘నా చావుకు కేసీఆర్ ముహూర్తం పెట్టాలే’

By Mahesh KFirst Published Oct 21, 2023, 2:50 PM IST
Highlights

ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పురుగుల మందు డబ్బాతో హల్ చల్ చేశారు. దళిత బంధు అమలు కాకుంటే చచ్చిపోతానని గతంలో తాను చెప్పానని, కేసీఆర ముహూర్తం పెడితే తాను గడ్డి మందు తాగి చనిపోతానని అన్నారు.
 

హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురుగుల మందు డబ్బాతో హల్‌‌చల్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్‌ను నమ్మి పొరపాటు చేశానని అన్నారు. దళతులకు అన్యాయం జరిగితే గడ్డి మందు తాగి చచ్చిపోతానని చెప్పానని గుర్తు చేసుకున్నారు. దళిత బంధు అమలు కాకపోవడంతో దళిత యువత తనకు మెస్సేజీలు పెడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతానని అన్నారు.

దళిత బంధు పెడుతున్నానని కేసీఆర్ స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లానని, దళిత జాతికి మేలు జరుగుతుందని ఆయనను సమర్థించానని మోత్కుపల్లి అన్నారు. దళిత బంధు అమలు కాకుంటే చనిపోతానని గతంలో చెప్పానని, ఇప్పుడు దళిత బంధు అమలుకాకపోవడంతో చనిపోవాలని దళిత యువత తనకు మెస్సేజీలు పెడుతున్నారని వివరించారు. అందుకే గడ్డి మందు డబ్బా పట్టుకువచ్చుకున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతానని అన్నారు. కేసీఆర్ గట్టిగా ఉన్నాడని, ఆయన ఎలాగూ చావడని, తానైనా చనిపోతానని తెలిపారు. మాదిగ కులానికి మంత్రి పదవి కూడా కేసీఆర్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అని అన్నారు.

ప్రవళిక ఆత్మహత్యకు కేసీఆరే కారణం అని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో గ్రేటర్ చుట్టూ 30 సీట్లను బీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను ఢీకొట్టే సామర్థ్యం గల ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు. తుంగతుర్తి సీటు తనకు ఇవ్వకుంటే కాంగ్రెస్‌కు నష్టమేనని తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందరి నేతల ఇంటికి వెళ్లుతున్నారని, కానీ, దళితుడైన తన ఇంటికి రావడం లేదని వివరించారు.

Also Read: సీపీఐ నారాయణకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఓటర్.. బాల్కాసుమన్ తో కుమ్మక్కయ్యారా అంటూ కడిగిపారేసిన వ్యక్తి...

ఇక చంద్రబాబు అరెస్టు గురించి మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఏమైనా జరిగితే దానికి జగన్ బాధ్యత వహించాలని మోత్కుపల్లి అన్నారు. జగన్, కేసీఆర్, బీజేపీ కలిసి చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.

click me!