
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొంగరకొలన్ లోని ప్రగతి నివేదన సభకు బయలు దేరారు. ప్రగతిభవన్ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సభా ప్రాంగణానికి 6.15 నిమిషాలకు చేరుకోనున్నారు.
నాలున్నరేళ్లపాటు తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు అమలుపై కేసీఆర్ సుమారు రెండు గంటల పాటు ప్రసంగించనున్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు ఈరోజు కేబినేట్ లో తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్ ప్రకటించనున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినన్ని సంక్షేమ పథకాలను దేశంలో ఏ రాష్ట్రం అమలు చెయ్యలేదని ఇప్పటికే కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరనున్నారు. ఇకపోతే ఇప్పటికే కొంగర కలాన్ వేదిక వద్దకు రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో మంత్రులు చేరుకున్నారు.