నా కుడిభుజం రాజేందర్,లక్ష మెజారిటీతో గెలిపించండి:కేసీఆర్ పిలుపు

By Nagaraju TFirst Published Nov 20, 2018, 3:15 PM IST
Highlights

కరీంనగర్ జిల్లా వాటర్ జంక్షన్ కాబోతుందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎస్ఆర్సీపీ నుంచి హుజురాబాద్ నియోజకవర్గానికి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద పభలో పాల్గొన్న కేసీఆర్ జిల్లా వాసులకు వరాలు ప్రకటించారు. 
 

 
కరీంనగర్: కరీంనగర్ జిల్లా వాటర్ జంక్షన్ కాబోతుందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎస్ఆర్సీపీ నుంచి హుజురాబాద్ నియోజకవర్గానికి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద పభలో పాల్గొన్న కేసీఆర్ జిల్లా వాసులకు వరాలు ప్రకటించారు. 

హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఈటెల రాజేందర్ ఎంతో అభివృద్ధి చేశారని ప్రజలు ఆవిషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హుజురాబాద్ లో రైతులు మూడు పంటలు పండించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో క్రాప్ కాలనీలను ఏర్పాటు చేసి ఎక్కడ ఏ పంట వెయ్యాలో అనేది నిర్ధారించి రైతులకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. 

ఆర్థిక పెరుగుదలలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. 24 గంటలు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పుకొచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. 

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ పూర్వపు రోజులే గుర్తుకు వస్తాయన్నారు. రాష్ట్రం మళ్లీ ఎడారి అవుతుందన్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలకు సూచించారు. రైతాంగం 70శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నాం. జూన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కాబోతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో 365 రోజులు, చెక్ డ్యాంలు, మిడ్ మానేరు, ఎల్ ఎండీలు ఎప్పుడూ నిండే ఉంటాయన్నారు. 

తెలంగాణలో నీటి కొరత అనేది ఉండదని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులకు కరెంట్ ఇస్తున్నాం, భీమా ఇస్తున్నాం, నీరు అందిస్తున్నాం, రైతు బంధం పథకం కింద రుణాలు కూడా ఇస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.  

మరోవైపు హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధి మంత్రి ఈటెల రాజేందర్ కు వచ్చే ఎన్నికల్లో 80శాతం ఓట్లు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉదయం తనకు సర్వే అందిందని సర్వేలో ఈటెలకు 80శాతం ఓట్లు వస్తాయని సర్వే చెప్తుందన్నారు. 

మంత్రి ఈటెల రాజేందర్ తనకు కుడి భుజమన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలోనూ వెన్నంటి నా వెంటే ఉన్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆయనే నా కుడిభుజమన్నారు. నా కుడిభుజాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ కుడిభుజం బలంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో రాజేందర్ కు లక్ష మెజారిటీ తగ్గకుండా గెలిపించాలని కోరారు. 

హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటెల రాజేందర్ అద్భుత పాలన అందించారని కేసీఆర్ కొనియాడారు. ఏం చెయ్యాలన్నా అన్ని చేసి నిరూపిస్తారన్నారు. మంత్రి రాజేందర్ ఏది అడిగినా అన్నీ ఇచ్చామన్నారు. తనకు జీతం ఇచ్చేది కూడా మీ మంత్రి ఈటెల రాజేందర్ అంటూ కేసీఆర్ ఛలోక్తులు వేశారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

click me!