తుమ్మిళ్ల స్కీమ్ మొదటి పాయింట్ డిజైన్ మార్చాలని కేసీఆర్ ఆదేశం

First Published Jun 29, 2018, 3:23 PM IST
Highlights

తుమ్మిళ్ల లిఫ్ట్ డిజైన్ మార్పుకు కేసీఆర్ ఆదేశం

గద్వాల: తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదటి పాయింట్ డిజైన్ ను మార్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నష్టమైనా సరే డిజైన్ మార్చాల్సిందేనని ఆయన అధికారులను కోరారు.

శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సుంకేసుల బ్యారేజీ వద్ద పనులను ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు సంబంధించి మొదటి పాయింట్ డిజైన్ ను మార్చాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం కొనసాగిస్తున్న డిజైన్ కారణంగా  నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో డిజైన్ మార్చాలని కోరారు. ఇప్పటికే 4 కోట్లతో మొదటి డిజైన్ పనులు పది శాతం పూర్తి చేశారు. 

అయితే రూ.4 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయినా కూడ సీఎం మాత్రం అంగీకరించలేదు. డిజైన్ ను మార్చాల్సిందేనని ఆయన ఆదేశించారు. 

జూరాల  సోర్స్  నుండి నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా అవసరమైన వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నీటి పారుదల శాఖను ఆదేశించాఠు. తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం నుండి  ఈ ఏడాదే మొదటి దశ పంపింగ్ ప్రారంభం కావాలని చెప్పారు.  తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా 87,500 ఎకరాల ఆర్డిఎస్ ఆయకట్టును వందకు వంద శాతం స్థిరీకరించగలుగుతామన్నారు.

 
తుంగభద్ర నది నుండి నీటిని ఎత్తిపోసి ఆర్డీఎస్ కాలువలకు అందించే  తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్  రావు శుక్రవారం పరిశీలించారు.    తుంగభద్ర వద్ద ఇంటేక్ పాయింట్ ను,  అప్రోచ్ కెనాల్ ను, పంప్ హౌజ్ లను పరిశీలించారు.  

‘‘ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి వుండగా గత పదేళ్లుగా పూర్తి ఆయకట్టుకు నీరు రావడం లేదు.  తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి ఆయకట్టుకు నీరందుతుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  ‘‘తుమ్మిళ్లతో పాటు గట్టు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య వున్న నడిగడ్డలో  లక్షా  20 వేల  ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

 ‘‘జూరాల ద్వారా లక్షా నాలుగు వేల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా రెండున్నర లక్షల ఎకరాలు, భీమా ద్వారా  రెండున్నర లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్  ద్వారా 50 వేల ఎకరాలు, ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడానికి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని కేసీఆర్ చెప్పారు.. ఈ ప్రాజెక్టుల ద్వారానే తాగునీరు కూడా అందిస్తామన్నారు.

నీటిని సమగ్రంగా వినియోగించుకోవడానికి ప్రస్తుతం నిర్మిస్తున్న రిజర్వాయర్లతో పాటు  ఇంకా ఎన్ని రిజర్వాయర్లు అవసరమవుతాయనే విషయాన్ని  నిర్ధారించి, ప్రతిపాదనలు  రూపొందించాలని  ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

click me!