
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటంలో సీఎం కేసీఆర్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. శత్రువులు కూడా ఆయనను ఈ విషయంలో విమర్శించలేరు.
14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఆయన అన్ని రకాలుగా ఉద్యమం కొనసాగింపునకు శాయశక్తుల కృషి చేశారు.
అంతేకాదు... కనిపించిన ప్రతి దేవుడికి మొక్కుకున్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రులపై చిందులేసినా బెజవాడ కనకదుర్గమ్మ, తిరుమల వేంకటేశ్వరస్వామికి మాత్రం తెలంగాణ కల సాకారం కావాలని వేడుకున్నారు.
ఇన్నాళ్ల పోరాటం ఫలిచింది. కేసీఆర్ కల నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మాట నిలబెట్టుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే రూ. 3.5 కోట్ల ఖర్చుతో కిరీటం చేయించి వరంగల్ లో భద్రకాళి అమ్మవారికి సమర్పించారు. యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి, కొమరవెల్లి మల్లన్నకు సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు.
త్వరలో తిరుమల వేంకటేశ్వరస్వామికి రూ. 5. 50 కోట్లతో కానుకలు సమర్పించనున్నారు. అలాగే, విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కు పుడక చెల్లించి తన మొక్కులన్నీ తీర్చుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తైయ్యాయి. తిరుమల వెంకన్నకు, బెజవాడ కనకదుర్గమ్మకు సమర్పించే వజ్రాభరణాలను సిద్ధమయ్యాయి. దేశంలోని నిష్ణాతులతో అభరణాలను డిజైన్ చేయించారు.
అయితే, కోరిన కోర్కెలు తీర్చే దేవుళ్లకు మొక్కు చెల్లించడాన్ని ఎవరూ కాదనరు. అసలే కాస్త దైవ భక్తి ఎక్కువగా ఉండే సీఎం కేసీఆర్ ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారని అందిరికీ తెలిసిందే.
గతంలో తన ఫాం హౌజ్ దగ్గర్లో సొంత ఖర్చుతో రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని యాగం చేసిన విషయం తెలిసిందే.
అయితే ప్రభుత్వ ఖజానా నుంచి దేవుళ్లకు ఇలా కోట్ల రూపాయిల కానుకలు చెల్లించడంపై విమర్శలొస్తున్నాయి. సీఎం వ్యక్తిగత మొక్కుల భారం ప్రభుత్వ ఖజానాపై పడటం పై గతంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ ఫైర్ అయ్యారు.
వ్యక్తిగత హోదాలో మొక్కుకుంటే ప్రభుత్వ ఖర్చుతో కానుకలెలా ఇస్తారని సీఎంపై ధ్వజమెత్తారు. వీహెచ్ మాత్రమే కాదు చాలా మంది తెలంగాణ మేధావుల అభిప్రాయం కూడా ఇదే.