
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, తాగ్యాలను సీఎం స్మరించుకున్నారు. తెలంగాణ పోరాటంలో ఎదురైన కష్టాలను, ఎదుర్కొన్న అవమానాలను, అధిగమించిన అడ్డంకులను ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులకి, వారి అంకితభావానికి హృదయపూర్వకంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్వపరిపాలనకు 9ఏళ్లు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి అడుగుపెడుతున్నామని అన్నారు. ప్రత్యేకంగా రాష్ట్రంగా ఆవిర్బవించిన తొలినాళ్లలో ఎదురైన ఎన్నో అనుమానాలు పటాపంచలు చేస్తూ.. బాలారిష్టాలను దాటుకుంటూ.. అద్భుతంగా నిలదొక్కుకున్నమని అన్నారు. ప్రధానంగా ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొడుతూ.. నిలదొక్కుకోవడం అత్యద్భుతమని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకనాడు వెనకబాటుకు గురైన తెలంగాణ నేడు సమస్త రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో.. ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రం వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక రంగం సహా సమస్త రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధించిందని తెలిపారు. నేడు తెలంగాణ సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయని ప్రశంసించారు. గతంలో ఎన్నాడూ ఎరుగని రీతిలో తెలంగాణ పాలన సాగుతోందని, దేశానికే ‘తెలంగాణ మోడల్’ గా నిలిచిందని అన్నారు.
తెలంగాణ వంటి పాలన కావాలని, అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారనన్నారు. ఈ తెలంగాణ ప్రగతి విషయంలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమిదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఆనందరకర సమయంలో తమ సంతోషాలను పంచుకుంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగస్వాములై రాష్ట్ర ప్రజలందరూ వాడ వాడనా సంబురాలను ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.