ప్రధాని మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లాకు చెందని కొంతమంది నేతలకు అహంకారం పెరిగిందని.. బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ తొక్కనివ్వమని సవాళ్లు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఇల్లందులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయన్నారు. ప్రజలు మాత్రం వివేకంతో ఆలోచించి ఓటు వేయాలని.. దేశంలో రాజకీయ పరిణితి ఇంకా రావాల్సి వుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
పార్టీ చరిత్ర , దృక్పథం నిశితంగా గమనించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల పాలనను చూశారని సీఎం అన్నారు. ఇప్పటి వరకు పాలించిన పార్టీల్లో పాలన ఎవరు బాగా చేశారో గమనించాలని కేసీఆర్ పేర్కొన్నారు. సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే ఓడిపోయేది ప్రజలేనని.. ఎవరూ అడగకుండానే దళితబంధు , రైతుబంధు, మిషన్ భగీరధ పథకం తెచ్చామని తెలిపారు.
మోడీ ఇప్పటికే పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు ప్రైవేట్‌పరం చేశారని కేసీఆర్ దుయ్యబట్టారు. విద్యుత్‌ను కూడా ప్రైవేట్‌పరం చేయాలని మోడీ చూస్తున్నారని.. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ ఒత్తిడి చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. తన ప్రాణం పోయినా.. మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని చెప్పానని సీఎం వెల్లడించారు. బీఆర్ఎస్ రాకముందు రైతుబంధు అనే పదం వినబడిందా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒకప్పుడు వ్యవసాయం చేసేవారికి ఎవరూ పిల్లనిచ్చేవారు కాదని.. ఇప్పుడు అమ్మాయిని ఇచ్చే ముందు భూమి వుందా అని అడుగుతున్నారని సీఎం పేర్కొన్నారు. తాము చేపట్టిన చర్యల వల్లే వ్యవసాయానికి విలువ పెరిగిందని.. లక్షల మంది రైతులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చామని కేసీఆర్ గుర్తుచేశారు.
పోడు రైతులపై వున్న కేసులు ఎత్తివేయించామని.. పట్టాలు ఇచ్చి పోడు రైతులకు కూడా రైతుబంధు ఇచ్చామన్నారు. ఏ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరిగిందో గమనించాలని.. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ మూడు గంటలు చాలని మరో కాంగ్రెస్ నేత అంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రైతుబంధు వుండాలో, వద్దో ప్రజలే ఆలోచించుకోవాలని కేసీఆర్ సూచించారు.
అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే 93 లక్షల మంది రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని సీఎం వెల్లడించారు. 93 లక్షల మంది రేషన్ కార్డుదారులకు బీమా కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందని కొంతమంది నేతలకు అహంకారం పెరిగిందని.. బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ తొక్కనివ్వమని సవాళ్లు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి పంపేది ప్రజలు కానీ.. అహంకారంతో వున్న నేతలు కాదని కేసీఆర్ చురకలంటించారు.